Cricketer Cheteshwar Pujara: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా నయావాల్
టీమిండియా నయావాల్;
Cricketer Cheteshwar Pujara: క్రికెటర్ చతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ఆగస్టు 24న సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. భారత క్రికెట్ జట్టుకు చెందిన టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. టెస్ట్ క్రికెట్‌లో తన అద్భుతమైన డిఫెన్స్, సుదీర్ఘంగా క్రీజులో నిలబడగల సామర్థ్యం కారణంగా అతడిని 'నయా వాల్' అని పిలుస్తారు.
తన రిటైర్మెంట్ ప్రకటనలో పుజారా, తన కుటుంబ సభ్యులకు, కోచ్‌లకు, సహ ఆటగాళ్లకు, అభిమానులకు, అలాగే బీసీసీఐ , సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత కొంతకాలంగా జట్టులో చోటు కోల్పోవడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
పుజారా 103 టెస్టు మ్యాచ్‌లు ఆడి 43.60 సగటుతో 7,195 పరుగులు చేశారు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో ఆయన కేవలం 5 మ్యాచ్‌లలో మాత్రమే ఆడారు. ఇందులో 51 పరుగులు చేశారు.పుజారా 2010లో ఆస్ట్రేలియాపై బెంగళూరులో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన చివరిసారిగా 2023లో ఆస్ట్రేలియాపై జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడారు.
పుజారా టెస్ట్ క్రికెట్‌లో అనేక రికార్డులు నెలకొల్పారు. ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో 500కి పైగా బంతులు ఎదుర్కొన్న ఏకైక భారత బ్యాట్స్‌మెన్ ఆయనే. 2017లో రాంచీలో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో ఆయన 525 బంతులు ఎదుర్కొని ఈ రికార్డు సాధించారు. 2018-19లో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ టెస్ట్ సిరీస్‌ను గెలవడంలో పుజారా కీలక పాత్ర పోషించారు. ఆ సిరీస్‌లో అత్యధికంగా 521 పరుగులు చేసి సిరీస్ విజయాన్ని సాధించిపెట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికీ, దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర తరపున, ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో ససెక్స్ తరపున ఆడారు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 21,301 పరుగులు చేసి ఒక గొప్ప రికార్డును నెలకొల్పాడు.