Gujarat Coach Praises Virat Kohli: ఓటమి బాధలో ఉన్నా.. కోహ్లీపై గుజరాత్ కోచ్ ప్రశంసల జల్లు!

కోహ్లీపై గుజరాత్ కోచ్ ప్రశంసల జల్లు!

Update: 2026-04-25 06:00 GMT

Gujarat Coach Praises Virat Kohli: గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విరాట్ కోహ్లీ నామస్మరణ మారుమోగిపోయింది. ఓటమిపై గుజరాత్ కోచ్ విజయ్ దహియాను ప్రశ్నించాల్సిన మీడియా ప్రతినిధులు, కోహ్లీ ఇన్నింగ్స్ మరియు అతని ఫిట్‌నెస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపుగా ఈ సమావేశం ఒక విరాట్ కోహ్లీ ఫ్యాన్ క్లబ్ మీటింగ్‌లా మారిపోయింది.

గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ విజయ్ దహియా మాట్లాడుతూ.. తాము చేసిన 205 పరుగుల స్కోరు డిఫెండ్ చేయదగ్గదేనని, అయితే మొదటి బంతికే కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడం తమ కొంపముంచిందని అభిప్రాయపడ్డారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కోహ్లీ 44 బంతుల్లోనే 81 పరుగులు చేసి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాడని పేర్కొన్నారు.

37 ఏళ్ల వయసులో కూడా కోహ్లీ కుర్రాళ్లను పరుగులు పెట్టిస్తున్నాడని, వికెట్ల మధ్య పరిగెత్తడంలో అతనే అత్యుత్తమమని కొనియాడారు. కోహ్లీకి ఉన్న పట్టుదలను హిందీలో 'జిద్' అని అభివర్ణించారు. సాధారణంగా ఈ పదాన్ని నెగటివ్‌గా వాడతాం, కానీ కోహ్లీ విషయంలో ఆ పట్టుదలే అతన్ని అత్యుత్తమంగా నిలబెడుతుందని చెప్పారు. కోహ్లీ ఇప్పుడు ఎవరికో ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, అద్దంలో తనను తాను చూసుకుంటూ.. నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా ఉండాలనే కసితోనే ఆడుతున్నాడని దహియా వెల్లడించారు.

మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీతో మాట్లాడిన విషయాలను కోచ్ పంచుకున్నారు. "81 పరుగులు చేసినా కోహ్లీ సంతృప్తిగా లేడు. ఆ ఇన్నింగ్స్‌ను సెంచరీగా మలచలేకపోయాననే అసహనం అతనిలో కనిపించింది" అని దహియా తెలిపారు. ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం కోహ్లీ ఒత్తిడిలోకి నెట్టే విధానం అద్భుతమని ఆయన ప్రశంసించారు.

Tags:    

Similar News