Tilak Varma on Pakistan's Sledging: ఆవేశానికి పోలేదు.. విజయంతోనే జవాబిచ్చాం.. పాక్ స్లెడ్జింగ్‌పై తిలక్ వర్మ

పాక్ స్లెడ్జింగ్‌పై తిలక్ వర్మ

Update: 2025-09-30 11:30 GMT

Tilak Varma on Pakistan's Sledging: ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్ వర్మ, ప్రత్యర్థి జట్టు స్లెడ్జింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయం తర్వాత మంగళవారం నగరంలోని లింగంపల్లిలో గల లేగల గ్రౌండ్‌ను సందర్శించిన తిలక్ వర్మ, అక్కడ శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో ముచ్చటించారు. ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు తిలక్ వర్మ సమాధానాలు ఇచ్చారు.

ఫైనల్‌లో పాక్ స్లెడ్జింగ్: తిలక్ వివరణ

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆసియా కప్‌లో రెండు జట్లు మూడుసార్లు తలపడ్డాయి. ఫైనల్ మ్యాచ్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా కనిపించిందని తిలక్ వర్మ వెల్లడించారు. "పాకిస్థాన్‌తో ఫైనల్‌మ్యాచ్‌లో టీమిండియా ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో మేం కాస్త ఒత్తిడికి గురయ్యాం. అదే సమయంలో పాక్ ఆటగాళ్లు ఇదే అదునుగా భారీ ఎత్తున స్లెడ్జింగ్‌కు దిగారు. మైదానంలో జరిగిన సంభాషణలు ఇక్కడ చెప్పడం సమంజసం కాదు" అని తిలక్ అన్నారు.

ఆ సమయంలో తాము ఉద్రేకానికి గురికాలేదని, సంయమనం పాటించామని తిలక్ వివరించారు. "ఎందుకంటే టీమిండియా మ్యాచ్ గెలవడమే ముఖ్యం. అనవసరంగా ఆవేశానికి గురై.. ఏదైనా చెడ్డ షాట్ ఆడితే వికెట్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే వారికి మ్యాచ్ మధ్యలో సమాధానం ఇవ్వకుండా.. మ్యాచ్ పూర్తయ్యాకే విజయంతో జవాబు చెప్పాం" అని ధీమాగా తెలిపారు.

కోచ్ సలాంకు రుణపడి ఉంటా

తన అంతర్జాతీయ కెరీర్‌లో సాధించిన రెండు సెంచరీల కంటే కూడా ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్సే తనకు ఫేవరెట్ అని తిలక్ వర్మ పేర్కొన్నారు. తనను తీర్చిదిద్దిన చిన్ననాటి కోచ్ సలాంకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ మాదిరిగానే తాను కూడా కోచ్‌కు గౌరవ మర్యాదలు ఇస్తానని అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ , బీసీసీఐకి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News