Chennai Super Kings: ముఖేష్ చౌదరికి కన్నీటి వీడ్కోలు: సీఎస్కే చారిత్రాత్మక విజయం ఆయనకే అంకితం!

సీఎస్కే చారిత్రాత్మక విజయం ఆయనకే అంకితం!

Update: 2026-04-24 05:25 GMT

Chennai Super Kings: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌పై సాధించిన చారిత్రాత్మక విజయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన జట్టు పేసర్ ముఖేష్ చౌదరికి అంకితం చేశారు. వ్యక్తిగత విషాదంలో ఉన్నప్పటికీ జట్టు కోసం మైదానంలోకి దిగిన ముఖేష్ పట్ల గైక్వాడ్ ప్రశంసల వర్షం కురిపించారు.

ముఖేష్ చౌదరి తల్లి ప్రేమ దేవి గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ వారంలోనే కన్నుమూశారు. తల్లి అంత్యక్రియల కోసం రాజస్థాన్‌లోని తన స్వగ్రామం భిల్వారాకు వెళ్లిన ముఖేష్, జట్టుకు తన అవసరం ఉందని భావించి వెంటనే తిరిగి ముంబై చేరుకున్నారు. ముఖేష్ తల్లి మృతికి సంతాపంగా సీఎస్కే ఆటగాళ్లందరూ ఈ మ్యాచ్‌లో నల్లటి రిబ్బన్లు ధరించి ఆడారు.

పవర్‌ప్లేలో ముఖేష్ మ్యాజిక్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైని ముఖేష్ ఆరంభంలోనే దెబ్బతీశారు. తన మొదటి ఓవర్‌లోనే ప్రమాదకరమైన ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను అవుట్ చేసి ముంబై పతనాన్ని శాసించారు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 31 పరుగులే ఇచ్చి ఒక కీలక వికెట్ పడగొట్టారు.

కెప్టెన్ రుతురాజ్ ఎమోషనల్ కామెంట్స్

"ఈ విజయం ఖచ్చితంగా ముఖేష్‌కే అంకితం. అంతటి విషాదంలో ఉండి కూడా మానసికంగా కుంగిపోకుండా జట్టు కోసం తిరిగి రావడం సామాన్యమైన విషయం కాదు. ఆయనకు హ్యాట్సాఫ్! మేమందరం ముఖేష్ కోసమే ఈ మ్యాచ్ గెలవాలని ముందే నిర్ణయించుకున్నాం" అని గైక్వాడ్ మ్యాచ్ అనంతరం భావోద్వేగంతో చెప్పారు.

రికార్డు విజయం సాధించిన సీఎస్కే

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై, స్టార్ ఓపెనర్ సంజూ శామ్సన్ (54 బంతుల్లో 101* - ఈ సీజన్‌లో రెండో సెంచరీ) మెరుపు ఇన్నింగ్స్‌తో 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ కేవలం 104 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ముంబైపై పరుగుల పరంగా (103 పరుగులు) చెన్నై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అకీల్ హొస్సేన్ 4 వికెట్లతో ముంబై వెన్ను విరిచారు.

Tags:    

Similar News