Michael Hussey: సీఎస్కేలో ముగిసిన మిస్టర్ క్రికెట్ శకం: 15 ఏళ్ల అనుబంధానికి మైఖేల్ హస్సీ వీడ్కోలు..
మైఖేల్ హస్సీ వీడ్కోలు..
Michael Hussey: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తమ సహాయక సిబ్బందిలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. జట్టుతో దాదాపు 15 ఏళ్లకు పైగా ఆటగాడిగా, కోచ్‌గా సుదీర్ఘ అనుబంధం ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం, మిస్టర్ క్రికెట్ మైఖేల్ హస్సీతో ఫ్రాంచైజీ విడిపోయింది. ఈ నిర్ణయాన్ని యాజమాన్యం ఇప్పటికే హస్సీకి తెలియజేసినట్లు సమాచారం.
కోచింగ్ విభాగంలో కీలక మార్పులు
2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హస్సీ, జట్టు పలుమార్లు ఛాంపియన్‌గా నిలవడంలో తెరవెనుక కీలక పాత్ర పోషించారు. తాజా పరిణామాలతో ఆయన తదుపరి సీజన్‌లో మరో ఐపీఎల్ ఫ్రాంచైజీకి కోచ్‌గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు సీఎస్‌కే ఇప్పటికే ప్రధాన కోచింగ్ విభాగంలో సంచలన మార్పులు చేపట్టింది. సుదీర్ఘకాలం హెడ్ కోచ్‌గా సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. బౌలింగ్ కోచ్‌గా మాజీ సీఎస్‌కే పేసర్ మోహిత్ శర్మ ఎంపికయ్యారు. హస్సీ నిష్క్రమణతో ఖాళీ అయిన బ్యాటింగ్ కోచ్ పదవికి సంబంధించి ఫ్రాంచైజీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆటగాడిగా చెరిగిపోని ముద్ర
కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు హస్సీ సీఎస్‌కే బ్యాటింగ్ లైనప్‌కు ప్రధాన వెన్నెముకగా నిలిచారు. 2008 తొలి సీజన్ నుంచి 2013 వరకు, ఆపై ముంబై ఇండియన్స్‌లో ఒక సీజన్ ఆడి తిరిగి 2015లో చెన్నై తరఫున ఆడారు. పసుపు జెర్సీతో ఆటగాడిగా రికార్డులు సృష్టించి, ఆపై కోచ్‌గా ఎందరో యువ ఆటగాళ్లను తీర్చిదిద్దిన మైఖేల్ హస్సీ నిష్క్రమణ చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో ఒక అధ్యాయం ముగింపుగా నిలిచింది.