New Zealand: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌కు ముందు ఇరు జట్లను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు భారత కీలక ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతుండగా, తాజాగా ఆతిథ్య కివీస్ జట్టుకు కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒకేసారి ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు మిడిలార్డర్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్, పేసర్ జాక్వరీ ఫోక్స్ ఈ సిరీస్‌కు దూరం కానున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ అధికారికంగా ప్రకటించింది.

వేర్వేరు టోర్నీల్లో గాయాలు..

న్యూజిలాండ్ బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఇద్దరు ఆటగాళ్లు వేర్వేరు టోర్నీల్లో ఆడుతూ గాయపడ్డారు. సిరీస్ ప్రారంభ సమయానికి వారు పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో జట్టు మేనేజ్‌మెంట్ వారిని తప్పించింది. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఆడుతున్న సమయంలో చాప్‌మన్ హామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. అయితే నవంబర్ 4 నుంచి మొదలయ్యే వన్డే సిరీస్ నాటికి అతడు కోలుకుంటాడని బోర్డు భావిస్తోంది. జాక్వరీ ఫోక్స్ కు దేశవాళీ టోర్నమెంట్ మ్యాచ్ సందర్భంగా ఫోక్స్ తుంటి భాగంలో తీవ్ర గాయమైంది. ఇతని రికవరీకి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో పునరాగమనంపై ఇంకా స్పష్టత రాలేదు.

జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లు వీరే..

చాప్‌మన్, ఫోక్స్ స్థానాల్లో న్యూజిలాండ్ సెలక్టర్లు ఇద్దరు ప్రత్యామ్నాయ ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేశారు..

బ్లెయిర్ టిక్నర్ (పేసర్): గాయపడిన ఫోక్స్ స్థానంలో అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్‌కు పిలుపు వచ్చింది. అయితే భారత్‌పై టిక్నర్ ట్రాక్ రికార్డ్ అంత ఆశాజనకంగా లేదు. టీమిండియాతో ఆడిన ఆరు టీ20 మ్యాచ్‌లలో టిక్నర్ 11.50 ఎకానమీతో భారీగా పరుగులు సమర్పించుకుని కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు.

జోష్ క్లార్క్‌సన్ (ఆల్‌రౌండర్): 29 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌కు టెస్ట్ జట్టులో చోటు దక్కింది. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో భారత్‌పై ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్లార్క్‌సన్, ఈ సిరీస్‌లో ఎలాంటి ప్రభావం చూపుతాడనేది ఆసక్తికరంగా మారింది. టెస్ట్ ఛాంపియన్‌షిప్ పరంగా ఎంతో కీలకమైన ఈ సిరీస్‌కు ముందు ఆటగాళ్ల గాయాలు ఇరు జట్ల వ్యూహాలకు పెద్ద పరీక్షగా మారనున్నాయి.

Tags: