Football Legend Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇండియా టూర్ కు లైన్ క్లియర్
ఇండియా టూర్ కు లైన్ క్లియర్;
Football Legend Messi: ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ త్వరలో భారతదేశ పర్యటనకు రానున్నారు. డిసెంబర్ 2025లో ఆయన 'GOAT Tour of India 2025' పేరుతో దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో పర్యటించనున్నారు.ఈ కార్యక్రమాలను ఈవెంట్ ప్రమోటర్ సతద్రు దత్తా నిర్వహిస్తున్నారు.
పర్యటన షెడ్యూల్:
డిసెంబర్ 12న మెస్సీ కోల్‌కతాకు చేరుకుంటారు. ఇది ఆయన పర్యటనలో ఎక్కువ సమయం గడిపే నగరం. ఇక్కడ 'మీట్ అండ్ గ్రీట్', 'GOAT కాన్సర్ట్', 'GOAT కప్' లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈడెన్ గార్డెన్స్ లేదా సాల్ట్ లేక్ స్టేడియంలలో వీటిని నిర్వహించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారని సమాచారం.
డిసెంబర్ 13న కోల్‌కతా కార్యక్రమాల తర్వాత మెస్సీ అహ్మదాబాద్‌కు వెళ్తారు. అక్కడ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబర్ 14న ఆ తర్వాత ముంబైకి చేరుకుంటారు. ఇక్కడ కూడా 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం, 'GOAT కాన్సర్ట్, GOAT కప్' ఉంటాయి. వాంఖడే స్టేడియంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక్కడ క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఒక ప్యాడెల్ మ్యాచ్‌లో కూడా పాల్గొంటారని సమాచారం.
డిసెంబర్ 15న పర్యటన చివరి రోజున మెస్సీ న్యూఢిల్లీకి వెళ్తారు. అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన నివాసంలో భేటీ అవుతారు. ఆ తర్వాత ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరిగే 'GOAT కాన్సర్ట్, GOAT కప్'లలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శుభమాన్ గిల్ పాల్గొనే అవకాశం ఉంది.
మెస్సీ భారత్ కు రావడం ఇది రెండోసారి. ఇంతకు ముందు 2011లో అర్జెంటీనా జాతీయ జట్టుతో కలిసి వెనిజులాతో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి కోల్‌కతా వచ్చారు.