CSK Captain: చెన్నై సూపర్ కింగ్స్‌లో కెప్టెన్సీ మార్పుపై చర్చ మొదలైంది. గత మూడు సీజన్లుగా జట్టు ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోవడంతో.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా చేయాలని మాజీ భారత ఓపెనర్ సడగోపన్ రమేష్ సూచించారు.

గైక్వాడ్ కెప్టెన్సీలో CSK ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ముఖ్యంగా 2026 సీజన్‌లో గైక్వాడ్ బ్యాటర్‌గా కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ సీజన్‌లో ఆయన 28 సగటుతో కేవలం 337 పరుగులు చేశారు. పవర్‌ప్లేలో బ్యాటర్లలో అత్యల్ప స్ట్రైక్‌రేట్ కూడా గైక్వాడ్‌దే అని రమేష్ పేర్కొన్నారు.

ఇక సంజూ శాంసన్ CSKలోకి రావడంతో.. అతడికే కెప్టెన్సీ అప్పగిస్తారా? అనే చర్చ మొదలైంది. CSK కెప్టెన్సీపై జట్టు యాజమాన్యం కూడా పలు అవకాశాలను పరిశీలిస్తోందని రమేష్ అన్నారు. కెప్టెన్సీలో మార్పు చేయాలని నిర్ణయిస్తే సంజూ శాంసన్‌ను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

సంజూ మంచి టీమ్ ప్లేయర్ అని, కెప్టెన్‌గా కూడా అతడికి మంచి అనుభవం ఉందని రమేష్ చెప్పారు. IPLలో సంజూ 66 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి 33 విజయాలు సాధించాడని, అంటే 50 శాతం విజయాల రికార్డు ఉందని తెలిపారు. అతడి నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ ఒకసారి ఫైనల్‌కు చేరడంతో పాటు మరోసారి ప్లేఆఫ్స్‌కు వెళ్లిందని గుర్తు చేశారు.

అయితే సంజూను కెప్టెన్‌గా చేస్తేనే CSK సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అనుకోవద్దని రమేష్ స్పష్టం చేశారు. జట్టులో ఇంకా చాలా మార్పులు అవసరమని చెప్పారు. మరోవైపు మాజీ భారత క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కూడా గతంలో గైక్వాడ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అతడు బ్యాటర్‌గా మరింత స్వేచ్ఛగా ఆడగలడని అభిప్రాయపడ్డారు.

అయితే CSK ఎప్పుడూ స్థిరత్వానికి ప్రాధాన్యం ఇచ్చే జట్టు. హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం ఆ జట్టు శైలి కాదు. మరి గైక్వాడ్‌ను కొనసాగిస్తారా? లేక సంజూ శాంసన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags: