Gautam Gambhir: అజిత్ అగార్కర్‌కు గౌతమ్ గంభీర్ వీడ్కోలు.. ‘చరిత్ర మిమ్మల్ని మరింత గొప్పగా గుర్తుంచుకుంటుంది’
గొప్పగా గుర్తుంచుకుంటుంది’
Gautam Gambhir: టీమిండియా చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్.. మాజీ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌కు ఆత్మీయ వీడ్కోలు సందేశం ఇచ్చాడు. అగార్కర్ స్థానంలో కొత్త సెలెక్టర్ కోసం బీసీసీఐ అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానించిన మరుసటి రోజే గంభీర్ ఈ సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అగార్కర్ పదవీకాలం ఈ నెల 4న ముగిసింది. ఆయన తన పదవీకాలాన్ని పొడిగించుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో ఈ మార్పు జరిగింది.
గంభీర్ తన ‘ఎక్స్’ ఖాతాలో అగార్కర్‌ను ఉద్దేశించి.. “డియర్ అజిత్ భాయ్.. మీతో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మీరు నమ్మిన ‘టీమ్ ఫస్ట్.. టీమ్ ఎహెడ్’ అనే సిద్ధాంతానికి ఆ మూడు ఐసీసీ ట్రోఫీలే నిదర్శనం. చరిత్ర మిమ్మల్ని మరింత గొప్పగా గుర్తుంచుకుంటుందని చెప్పగలను. మీరు చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. మీ భవిష్యత్ ప్రయాణానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చాడు.
అగార్కర్ పురుషుల సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో టీమిండియా మూడు ఐసీసీ టైటిళ్లు సాధించింది. ఇందులో 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నాయి. ఈ విజయాల్లో సెలెక్షన్ కమిటీ పాత్ర కీలకంగా నిలిచింది.
అదే సమయంలో భారత క్రికెట్‌లోని పలువురు దిగ్గజ ఆటగాళ్ల రిటైర్మెంట్లను కూడా అగార్కర్ పదవీకాలంలోనే చూశాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించగా.. రవిచంద్రన్ అశ్విన్, ఛెతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నారు.
ప్రస్తుతం భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా సెలెక్షన్ కమిటీకి తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్పీ సింగ్, శివ సుందర్ దాస్, అజయ్ రాత్రా ఇతర సభ్యులుగా ఉన్నారు. కొత్త సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవి కోసం బీసీసీఐ మంగళవారం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులు సమర్పించేందుకు అక్టోబర్ 14 చివరి తేదీగా నిర్ణయించింది. అగార్కర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రజ్ఞాన్ ఓజా ప్రధాన అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్నారు.
అయితే మాజీ భారత వికెట్ కీపర్-బ్యాటర్ పార్థివ్ పటేల్ కూడా సెలెక్షన్ కమిటీలోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పార్థివ్ పటేల్ కమిటీలో చేరితే.. సీనియారిటీ విషయంలో అతడికే ఎక్కువ ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. పార్థివ్ పటేల్ భారత్ తరఫున 25 టెస్టులు ఆడగా.. ప్రజ్ఞాన్ ఓజా 24 టెస్టులు ఆడాడు.
కొత్త సెలెక్టర్ల కోసం బీసీసీఐ విధించిన అర్హతల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అభ్యర్థి కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అలాగే క్రికెట్‌కు రిటైర్ అయి కనీసం ఐదేళ్లు పూర్తై ఉండాలనే నిబంధన కూడా ఉంది.
కొత్త సెలెక్షన్ కమిటీ ప్రధాన బాధ్యతల్లో అత్యుత్తమ సీనియర్ పురుషుల జాతీయ జట్టును ఎంపిక చేయడంతో పాటు.. భవిష్యత్ అవసరాలకు సరిపోయేలా బలమైన బెంచ్ స్ట్రెంగ్త్‌ను గుర్తించడం, అభివృద్ధి చేయడం కూడా కీలకంగా ఉంటుందని బీసీసీఐ పేర్కొంది.