Gautam Gambhir vs Social Media Giants: గౌతమ్ గంభీర్ వర్సెస్ సోషల్ మీడియా దిగ్గజాలు: డీప్‌ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్!

డీప్‌ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్!

Update: 2026-03-26 07:46 GMT

Gautam Gambhir vs Social Media Giants: భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ న్యాయపోరాటానికి దిగారు. తన అనుమతి లేకుండా తన ముఖం, గొంతు మరియు వ్యక్తిగత వివరాలను వాడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు.. గంభీర్‌కు వ్యతిరేకంగా ఉన్న అభ్యంతరకరమైన మరియు తప్పుదోవ పట్టించే పోస్టులను వెంటనే తొలగించాలని గూగుల్, మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) మరియు అమెజాన్ సంస్థలను ఆదేశించింది. డీప్‌ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన తప్పుడు వీడియోల వల్ల తన గౌరవానికి భంగం వాటిల్లుతోందని గంభీర్ పేర్కొన్నారు.

గంభీర్ తరపు న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ కోర్టులో వాదిస్తూ.. "భారత జట్టు హెడ్ కోచ్ పదవికి గంభీర్ రాజీనామా చేశారని, తోటి ఆటగాడిపై దాడి చేశారని డీప్‌ఫేక్ టెక్నాలజీతో తప్పుడు వీడియోలు సృష్టించారు. ఒక రాజీనామా వీడియోకు ఏకంగా 29 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా పెద్ద గందరగోళానికి దారితీసింది" అని వివరించారు. ఈ తప్పుడు ప్రచారం వల్ల గంభీర్ బ్రాండ్ విలువ దెబ్బతింటోందని, అందుకే ఆయన దాదాపు 2.5 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ దావా వేశారని తెలిపారు.

అంతేకాకుండా, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో గంభీర్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలతో కూడిన పోస్టర్లు మరియు ఇతర వస్తువులను విక్రయిస్తున్నారని గంభీర్ లీగల్ టీమ్ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మొత్తం 16 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో సోషల్ మీడియా అకౌంట్లతో పాటు మెటా, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉన్నాయి.

రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన గంభీర్ ఈ విషయంపై స్పందిస్తూ.. "నా పేరు, నా ముఖం, నా గొంతును ఆయుధాలుగా వాడుకుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇది కేవలం నా వ్యక్తిగత బాధకు సంబంధించిన విషయం కాదు; ఇది చట్టం, గౌరవం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో ఒక పబ్లిక్ ఫిగర్‌కు ఉండాల్సిన రక్షణకు సంబంధించిన అంశం" అని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News