Bangladesh’s T20 World Cup Boycott: టీ20 వరల్డ్ కప్ బహిష్కరణ వెనుక అసలు కుట్రదారు ఆయనే.. బంగ్లా బోర్డు కమిటీ సంచలన నివేదిక!
సంచలన నివేదిక!
Bangladesh’s T20 World Cup Boycott: భారత్ వేదికగా జరిగిన గత టీ20 ప్రపంచ కప్‌ను బంగ్లాదేశ్ రాజకీయ కారణాల వల్ల బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బహిష్కరణ వెనుక అసలు దోషి ఎవరో తాజాగా బంగ్లా క్రికెట్ బోర్డు దర్యాప్తు నివేదికలో బయటపడింది. దీనిపై బంగ్లా క్రికెట్ బోర్డు నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ లోతుగా విచారణ జరిపింది. ఆ దర్యాప్తు వివరాలను కమిటీ సభ్యుడైన ఫైజల్ దస్త్‌గిర్ తాజాగా వెల్లడించారు.
గత టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ ఎందుకు పాల్గొనలేదనే అంశంపై తాము సమగ్రంగా దర్యాప్తు చేశామని ఫైజల్ తెలిపారు. సంబంధిత వ్యక్తులతో జరిపిన చర్చలు, మీడియాలో వచ్చిన కథనాలు, ఇతర ఆధారాలన్నింటినీ పరిశీలించగా.. అప్పటి యువజన, క్రీడా వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఇందుకు ప్రధాన కారకుడిగా తేలిందని స్పష్టం చేశారు. అప్పటి ప్రభుత్వంతో పాటు ఆయనే ఈ నిర్ణయానికి పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. వాస్తవానికి బంగ్లాదేశ్ ఈ వరల్డ్ కప్‌లో కచ్చితంగా ఆడి ఉండాల్సిందని, కానీ నజ్రుల్ మాత్రం ఎవరితోనూ సంప్రదించకుండా ఏకపక్షంగా బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారని ఆయన వెల్లడించారు. కాగా, బంగ్లాదేశ్ టీ20 ప్రపంచ కప్‌లో ఆడి ఉంటే బాగుండేదని ప్రస్తుత బోర్డు ఛైర్మన్ తమీమ్ ఇక్బాల్ కూడా ఇటీవల అభిప్రాయపడ్డారు.
ఆసిఫ్ నజ్రుల్‌కు మొదటి నుంచీ భారత్ వ్యతిరేకిగా పేరుంది. అందుకే భారత్ వేదికగా జరగబోయే ఈ టోర్నమెంట్‌కు బంగ్లా జట్టును అస్సలు పంపించకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ, తొలుత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని బుకాయించారు. ఆ తర్వాత తానే స్వయంగా రంగంలోకి దిగి.. టీ20 ప్రపంచ కప్‌లో ఆడకూడదని ఆటగాళ్లు, కోచ్‌లు, జాతీయ జట్టు బోర్డే స్వయంగా నిర్ణయించుకున్నట్లు అప్పట్లో తప్పుడు ప్రకటన చేశారు.
కాని, ఇప్పుడు బంగ్లా బోర్డు నియమించిన ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన నిజాలను వెల్లడించింది. ఈ దర్యాప్తు కమిటీలో బంగ్లా యువజన, క్రీడల శాఖ అదనపు కార్యదర్శి ఏకేఎం ఒలీ ఉల్లా, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ - ప్రస్తుత చీఫ్ సెలక్టర్ హబిబుల్ బషర్, అలాగే న్యాయవాది ఫైజల్ దస్త్‌గిర్ సభ్యులుగా ఉన్నారు.