Hussain Talat: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్థాన్ ఆల్ రౌండర్ హుస్సేన్ తలత్ తన ఎడమ భుజానికి తీవ్రంగా గాయపడ్డాడు. ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బౌండరీని అడ్డుకునే క్రమంలో తలత్ ప్రమాదానికి గురయ్యాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ లిట్టన్ దాస్ కొట్టిన బంతిని ఆపేందుకు కవర్ బౌండరీ వైపు వేగంగా పరిగెత్తిన తలత్, అక్కడ ఉన్న ఫోమ్ ప్యాడింగ్‌పై కాలు వేయడంతో అదుపు తప్పి ప్రకటనల బోర్డులను బలంగా ఢీకొన్నాడు. తన ఎడమ భుజంపై పడటంతో తీవ్రమైన నొప్పితో అతను మైదానంలోనే విలవిలలాడాడు. వెంటనే జట్టు సిబ్బంది స్ట్రెచర్ సాయంతో అతడిని అంబులెన్స్‌లో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్పందిస్తూ.. మైదానంలోనే వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారని, మెరుగైన పరీక్షల కోసం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపింది. స్కానింగ్ రిపోర్టులు వచ్చిన తర్వాతే గాయం తీవ్రత ఎంతవరకు ఉందనేది స్పష్టమవుతుందని బోర్డు వెల్లడించింది.

సల్మాన్ అలీ ఆఘా విచిత్రమైన రనౌట్: మైదానంలో వివాదం

మరోవైపు, ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘా ఒక వింత పరిస్థితిలో అవుట్ అయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మొహమ్మద్ రిజ్వాన్ కొట్టిన బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సల్మాన్ ప్యాడ్లకు తగిలి ఆగిపోయింది. ఆ సమయంలో క్రీజు బయట ఉన్న సల్మాన్, సహజంగా బంతిని తీసి బౌలర్ మెహదీ హసన్ మిరాజ్‌కు అందించే ప్రయత్నం చేశాడు. అయితే మిరాజ్ వెంటనే బంతిని అందుకుని స్టంప్స్‌ను పడగొట్టి రనౌట్ కోసం అప్పీల్ చేశాడు.

ఆన్-ఫీల్డ్ అంపైర్లు దీనిని థర్డ్ అంపైర్‌కు నివేదించగా, నియమ నిబంధనల ప్రకారం బంతి ఇంకా డెడ్ కాలేదని భావించి సల్మాన్‌ను అవుట్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయంతో సల్మాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పెవిలియన్ చేరుకునే సమయంలోనూ అతను తన అసంతృప్తిని స్పష్టంగా ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది.

Tags: