Ambati Rayudu: హెచ్‌సీఏ కీలక నిర్ణయం: క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా అంబటి రాయుడు
క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా అంబటి రాయుడు
Ambati Rayudu: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో భారీ సంస్కరణలకు తెరలేచింది. వివాదాలకు స్వస్తి పలికి, పారదర్శకత వైపు అడుగులు వేస్తూ హెచ్‌సీఏ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ అంబటి రాయుడును 'క్రికెట్ ఆపరేషన్స్ హెడ్'గా నియమిస్తూ ప్రకటన చేసింది.
మే 5, 2026న ఉప్పల్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్నాథ్, కార్యదర్శి జీవన్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. రాయుడు వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు వ్యవస్థలోకి రావడం వల్ల హైదరాబాద్ క్రికెట్ రూపురేఖలు మారుతాయని వారు ధీమా వ్యక్తం చేశారు. కేవలం నియామకాలే కాదు, అసోసియేషన్‌లో అవినీతిని కూకటివేళ్లతో తొలగించేందుకు ప్రత్యేకంగా 'యాంటీ కరప్షన్ యూనిట్'ను కూడా ఏర్పాటు చేశారు.
ఈ కొత్త యాంటీ కరప్షన్ యూనిట్‌కు చైర్మన్‌గా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ విజేందర్ పింగలే వ్యవహరించనున్నారు. ఇకపై క్రికెట్ సంబంధిత ఫిర్యాదులు ఏవైనా ఉంటే, వాటిని వేగంగా పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక 'గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజాన్ని' కూడా ప్రారంభించారు. తద్వారా ఆటగాళ్లకు, క్లబ్ ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.
క్రికెట్ లీగ్ సీజన్ 2026–27ను మే 12 నుంచి గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. మొదటగా A , B డివిజన్ టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అలాగే, 'హెచ్‌సీఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమీ'ని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దాలని అసోసియేషన్ నిర్ణయించింది. ఆధునిక శిక్షణ సౌకర్యాలు కల్పించి, నగర ఆటగాళ్లతో పాటు జిల్లా స్థాయి , గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు కూడా సమాన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.