Rohit Sharma: ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని బ్యాటర్‌గా, అత్యంత సంపన్న క్రీడాకారుల్లో ఒకరిగా వెలుగొందుతున్న టీమిండియా స్టార్ రోహిత్ శర్మ, తన ఎదుగుదల వెనుక ఉన్న కఠినమైన గతాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు కనీసం థియేటర్‌కు వెళ్లి సినిమా చూసేందుకు కూడా తన కుటుంబం వద్ద డబ్బులు ఉండేవి కావని, ప్రాణ స్నేహితుల సాయంతోనే తాను తొలిసారి థియేటర్‌ మెట్లు ఎక్కానని హిట్‌మ్యాన్ వెల్లడించారు. సోనీ టీవీలో ప్రసారమయ్యే ఫ్యామిలీ ఫుల్ హౌస్ రియాలిటీ షోలో పాల్గొన్న రోహిత్, తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

చుంకీ పాండే ప్రశ్నకు రోహిత్ ఓపెన్ హార్ట్

ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు చుంకీ పాండే రోహిత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. "స్టేడియంలో లైవ్ మ్యాచ్ చూసినట్లే, థియేటర్‌లో సినిమా చూస్తే ఆ మజానే వేరు. మీ జీవితంలో థియేటర్‌లో చూసిన మొదటి సినిమా ఏది? ఆ అనుభవం ఎలా ఉండేది?" అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు రోహిత్ శర్మ ఏమాత్రం దాచుకోకుండా తన చిన్ననాటి ఆర్థిక పరిస్థితులను వివరించారు.. "చిన్నతనంలో మా ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండేది. థియేటర్‌కు వెళ్లి సినిమా టికెట్ కొనే స్థోమత మా కుటుంబానికి అస్సలు లేదు. అయితే నాకు దక్కిన స్నేహితులు ఎంతో మంచివాళ్లు. నాపై ప్రేమతో వాళ్లే సొంతంగా డబ్బులు పోగుచేసి నన్ను మొదటిసారి థియేటర్‌కు తీసుకెళ్లారు. ఆ రోజుల్లో మేం చూసిన మొదటి సినిమా ఒక హారర్ మూవీ" అని చెప్పారు.

టికెట్ వాళ్లదే.. ఛాయిస్ వాళ్లదే..

ఆ సినిమా ఎంపికపై రోహిత్ మాట్లాడుతూ సరదా వ్యాఖ్యలు చేశారు. "ఆ సినిమా థియేటర్ మా ఇంటికి సమీపంలో ఉండేది. అక్కడ హారర్ సినిమా ఆడుతుండటంతో వాళ్లే ఆ సినిమా చూడాలని ఫిక్స్ అయ్యారు. టికెట్లకు డబ్బులు పెట్టింది నా ఫ్రెండ్సే కాబట్టి, ఏ సినిమా చూడాలనే ఛాయిస్ నా దగ్గర లేదు. వాళ్లు ఏది చూపిస్తే అదే చూడాలి. సినిమా చాలా అద్భుతంగా ఉంది, మేమంతా కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశాం. స్నేహితులందరం కలిసి చేసిన ఆ ప్రయాణం, ఆ మధురానుభూతి నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమే" అని రోహిత్ పేర్కొన్నారు.

అభిమానులను కట్టిపడేస్తున్న హిట్‌మ్యాన్ వినయం

కోట్లాది రూపాయల ఆస్తులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పటికీ.. తాను వచ్చిన మూలాలను, ఎదుర్కొన్న పేదరికాన్ని, కష్టకాలంలో ఆదుకున్న స్నేహితులను మర్చిపోకుండా రోహిత్ మాట్లాడిన తీరు నెటిజన్లను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సందేశాన్ని ఆయన ప్రయాణం మరోసారి చాటిచెప్పింది.

Tags: