IND vs AFG: ఇండియా బ్యాటర్లు దంచినా.. భారత్‌పై అఫ్గానిస్తాన్ సంచలన విజయం
భారత్‌పై అఫ్గానిస్తాన్ సంచలన విజయం
IND vs AFG: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్-ఎ, ఆఫ్ఘనిస్తాన్-ఎ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో వర్షం దోబూచులాడింది. హై-స్కోరింగ్ మ్యాచ్‌గా సాగిన ఈ పోరులో చివరికి వరుణుడి సహకారంతో డీఎల్ఎస్ (DLS) విధానం ప్రకారం భారత్-ఎ జట్టుపై ఆఫ్ఘనిస్తాన్-ఎ జట్టు 4 పరుగుల తేడాతో అనూహ్య విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్-ఎ జట్టు భారీ స్కోరు సాధించినప్పటికీ, వర్షం కారణంగా సమీకరణాలు మారిపోయి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వైపు తిరిగింది.
ఈ మ్యాచ్‌లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టుకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. అయితే భారత బ్యాటర్లు మాత్రం అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కేవలం 84 పరుగులు చేసి జట్టుకు భారీ పునాది వేయగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 66 పరుగులు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 66 పరుగులతో హాఫ్ సెంచరీల మోత మోగించారు. ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా 44 రన్స్‌తో మెరిశాడు. దీంతో భారత్-ఎ నిర్ణీత 49 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో అబ్దుల్లా 5 వికెట్లతో చెలరేగగా, సాఫి 3 వికెట్లు పడగొట్టాడు.
350 పరుగుల భారీ లక్ష్యంతో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ప్రారంభించగా.. మళ్లీ వర్షం కురిసింది. దాంతో అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను 38 ఓవర్లకు కుదించి, డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం సవరించిన టార్గెట్‌ను 294 పరుగులుగా నిర్ణయించారు. ఈ ఛేదనలో అఫ్గాన్ బ్యాటర్లు చాలా పక్కా ప్లానింగ్‌తో ఆడారు. ఇమ్రాన్ 75 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, బహీర్ షా 51 పరుగులు, హసన్ 34 రన్స్ చేసి స్కోరు బోర్డును పరిగెత్తించారు. అఫ్గాన్ జట్టు 25.5 ఓవర్లలో 2 వికెట్లకు 177 పరుగులు చేసిన సమయంలో మరోసారి భారీ వర్షం పడటంతో ఆట సాధ్యపడలేదు. అప్పటికి డీఎల్ఎస్ పార్ స్కోర్ కంటే అఫ్గాన్ 4 పరుగులు ముందుండటంతో వారిని విజేతగా ప్రకటించారు. భారత బౌలర్లలో అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్ చెరో వికెట్ తీశారు. భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. దురదృష్టవశాత్తు వర్షం కారణంగా టీమిండియాకు ఈ మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు.