Asian Games 2026: ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే టీమ్ ఇండియాకు గోల్డ్ మెడల్? ఆసియా క్రీడల్లో ఆసక్తికర సమీకరణం..
ఆసక్తికర సమీకరణం..
Asian Games 2026: జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ విభాగంలో ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన సమీకరణం తెరపైకి వచ్చింది. కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే భారత క్రికెట్ జట్టు మెడలో స్వర్ణ పతకం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాకౌట్ దశలో వర్షం కురుస్తున్న తీరు, టోర్నమెంట్ ప్రత్యేక నిబంధనలే ఇందుకు ప్రధాన కారణం.
వర్షం పాలువుతున్న నాకౌట్ మ్యాచ్‌లు
ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లన్నీ దాదాపుగా వర్షార్పణమయ్యాయి. భారత్ ఆడాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సైతం వర్షం వల్ల రద్దయింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న జట్టును తర్వాతి రౌండ్‌కు పంపుతారు. ఈ నిబంధన ప్రకారం టీమ్ ఇండియా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 1 స్థానంలో ఉండటంతో, నేరుగా సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది.
సెమీఫైనల్, ఫైనల్‌పై వర్షం పడితే పరిస్థితి ఏమిటి?
సెమీఫైనల్ సమీకరణం
సెమీఫైనల్‌లో భారత్, శ్రీలంకతో తలపడాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ను కూడా వర్షం ముంచెత్తి రద్దయితే, మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా భారత్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.గత ఆసియా క్రీడల్లో ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయినప్పుడు, మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా భారత్‌కే స్వర్ణం ఇచ్చారు. దీనిపై విమర్శలు రావడంతో ఈసారి నిబంధనను సవరించారు. కొత్త నిబంధన ప్రకారం, ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల పూర్తిగా రద్దయితే ఫైనల్‌కు చేరిన రెండు జట్లకు సంయుక్తంగా స్వర్ణ పతకాలు ప్రదానం చేస్తారు.
ఒకవేళ సెమీఫైనల్, ఫైనల్ రెండింటినీ వర్షం అడ్డుకుంటే, మైదానంలోకి దిగి ఒక్క బంతి కూడా వేయకుండానే టీమ్ ఇండియాకు గోల్డ్ మెడల్ ఖాయమవుతుంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారత జట్టు ఖాతాలోకి మరో స్వర్ణం చేరడం లాంఛనమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.