India Registers Grand Victory: శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ!
భారత్ గ్రాండ్ విక్టరీ!
India Registers Grand Victory: విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
శ్రీలంక నిర్దేశించిన 122 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 14.4 ఓవర్లలోనే ఛేదించింది. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తూ 44 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఎడమచేతి వాటం రిస్ట్ స్పిన్నర్ శశిని గిమ్హాని వేసిన ఒకే ఓవర్లో జెమీమా నాలుగు బౌండరీలు బాది స్టేడియాన్ని హోరెత్తించింది. ఆమె స్మృతి మంధాన (25)తో కలిసి రెండో వికెట్‌కు 54 పరుగులు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (15 నాటౌట్)తో కలిసి మూడో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్, శ్రీలంకను 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులకే పరిమితం చేసింది. శ్రీలంక బ్యాటర్లలో విష్మి గుణరత్నే (39) టాప్ స్కోరర్‌గా నిలవగా, హసిని పెరీరా (20), హర్షిత సమరవిక్రమ (21) ఫరవాలేదనిపించారు.
భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు (15)ను క్లీన్ బౌల్డ్ చేసి తొలి వికెట్ పడగొట్టింది. స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఒక వికెట్ తీయగా, అరంగేట్రం చేసిన వైష్ణవి శర్మ తన 4 ఓవర్లలో కేవలం 16 పరుగులే ఇచ్చి ఆకట్టుకుంది. మంచు ప్రభావం ఉన్నప్పటికీ భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి లంక జట్టును కట్టడి చేశారు.
స్కోరు వివరాలు:
శ్రీలంక: 121/6 (20 ఓవర్లు) - విష్మి 39, హర్షిత 21; దీప్తి శర్మ 1/20, క్రాంతి గౌడ్ 1/23.
భారత్: 122/2 (14.4 ఓవర్లు) - జెమీమా 69*, మంధాన 25; ఇనోకా రణవీర 1/17.