Test Cricket : అభిమానులకు మజా పంచిన భారత్ ఇంగ్లాడ్ మూడో టెస్ట్ మ్యాట్

సిరీస్ పై ఆసక్తి పెంచిన లార్డ్స్ టెస్ట్ మ్యాచ్;

Update: 2025-07-16 06:32 GMT

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చెందితే చెందవచ్చు కానీ ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఇంతేసి ఉత్కంఠ , ఇంతేసి మజాను క్రికెట్‌ ఫ్యాన్స్‌ అనుభవించి చాన్నాళ్లే అయ్యింది. టీ- 20లకు అలవాటు పడ్డ వారు టెస్ట్ మ్యాచ్‌లను బోర్‌గా ఫీలవుతారు. ఈ స్పీడ్‌ కాలంలో అయిదు రోజుల పాటు ఓ మ్యాచ్‌ను చూసేంత తీరిక, ఓపిక లేవు. కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి మ్యాచ్‌లు టెస్ట్‌ల గొప్పతనాన్ని చాటి చెబుతుంటాయి. ఓ క్రికెటర్‌ టాలెంట్ ఏమిటో బయటపడేది ఇలాంటి మ్యాచ్‌ల వల్లే! ఇంగ్లాండ్‌ - ఇండియా మధ్య జరిగిన మొదటి రెండు మ్యాచ్‌లు కూడా ఉత్కంఠభరితంగానే సాగాయి. మూడో మ్యాచ్‌లో మాత్రం నరాలు తెగిపడేంత టెన్షన్‌ ఏర్పడింది. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లలో కలవరపాటు, కంగారు కూడా కనిపించాయి. కొన్ని సందర్భాలలో టెంపర్‌ను కూడా కోల్పోయారు. టీమిండియా ప్లేయర్లపై నోటి దూలను ప్రదర్శించారు. లార్డ్స్‌ మ్యాచ్‌ తర్వాత సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. సిరీస్‌ను గెలవాలంటే మాత్రం మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్ట్‌లో టీమిండియా తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పట్నుంచే టీమిండియా కసరత్తులు చేయడం బెటర్‌! నిజానికి మూడో మ్యాచ్‌లో టీమిండియా చాలా తప్పులు చేసింది. విశ్లేషకులు టీమిండియా పోరాడి ఓడిందని చెబుతున్నారు కానీ ఎక్కడా అది కనిపించలేదు. 193 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. బ్యాటింగ్‌ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. రవీంద్ర జడేజా ఎప్పటిలాగే ఫైట్‌ చేసినా ఓటమిని తప్పించలేకపోయాడు. నాలుగో రోజు చివరి సెషన్‌లో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడే ఏదో తేడా కొట్టింది. అసలు ఆ టైమ్‌లో కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌, కోచ్‌ గంభీర్‌లు కలిసి ఓ వ్యూహరచన చేయాల్సి ఉండాలి. అలాంటిదేమీ కనిపించలేదు. పైగా గిల్‌ బ్యాటింగ్‌ రావడం పెద్ద పొరపాటు. ఏ సుందర్‌నో పంపించి ఉంటే బాగుండేదన్నది సగటు అభిమాని భావన. అనవసరంగా గిల్‌ తన వికెట్‌ ను కోల్పోయాడు. గిల్‌ అవుటవ్వడంతో ఇంగ్లాండ్‌ సైకాలాజికల్‌ అడ్వాంటేజ్‌ తీసుకుంది. చివరి రోజు అదే ఊపుతో ఇంగ్లాండ్‌ మైదానంలో దిగింది. అప్పర్‌ హ్యాండ్‌ను సాధించింది.

జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఇప్పుడు మాంచెస్టర్‌ మ్యాచ్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తుది జట్టు కూర్పులో మార్పులు చేయక తప్పదు. కరుణ్‌ నాయర్‌ డొమిస్టిక్‌ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేసి ఉండవచ్చు కానీ ఈ సిరీస్‌లో దాన్ని కొనసాగించలేకపోయాడు. మూడు మ్యాచ్‌లలో ఒక్క హాఫ్‌ సెంచరీని కూడా చేయలేకపోయాడు. సాయి సుదర్శన్‌ విషయంలో తీసుకున్న కఠిన నిర్ణయం కరుణ్‌ నాయర్‌ పట్ల ఎందుకు తీసుకోవడంలేదో అర్థం కావడం లేదు. ఫైనల్‌ లెవన్‌ ఎంపికలో మేనేజ్‌మెంట్‌ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే సిరీస్‌ను చేజార్చుకోవాల్సి వస్తుంది. మన బౌలర్లు ఇంగ్లాండ్‌ టాప్‌ ఆర్డర్‌ను త్వరగానే ఇంటిదారి పట్టించగలుగుతున్నారు కానీ టైలెండర్ల వికెట్లు తీయలేకపోతున్నారు. లార్డ్స్‌లో ఇది మనకు కనిపించింది. ఇంగ్లాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగిదంటే ఇదే కారణం. ఓటమికి మరో ప్రధాన కారణమేమిటంటే ఉదారంగా ఎక్స్‌ట్రాలు ఇవ్వడమే. 31 ఎక్స్‌ట్రాలు ఇచ్చిన టీమిండియా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. మాంచెస్టర్‌లో ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటేనే సిరీస్‌లో టీమిండియా నిల్చోగలుగుతుంది. కాబట్టి ఇప్పట్నుంచే కసరత్తులు చేయడం ఉత్తమం! ఆల్‌ ది బెస్ట్‌ టు టీమిండియా!

Tags:    

Similar News