IPL 2026: IPL-19: గుజరాత్ టైటాన్స్ పంచ్.. SRH ఘోర పరాజయం

SRH ఘోర పరాజయం

Update: 2026-05-13 05:10 GMT

IPL 2026: ఐపీఎల్-19లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు కోలుకోలేని షాక్! వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆరెంజ్ ఆర్మీకి గుజరాత్ టైటాన్స్ బ్రేకులు వేసింది. బౌలర్లు కష్టపడి ప్రత్యర్థిని కట్టడి చేసినా.. బ్యాటర్ల ఘోర వైఫల్యంతో కీలక మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన ఈ పోరులో గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 44 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసి జట్టుకు మంచి పునాది వేశాడు. అతనికి తోడుగా వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సరిగ్గా 50 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. హైదరాబాద్ బౌలర్లు అక్కడక్కడా మెరిసినా, గుజరాత్ బ్యాటర్లను పూర్తిగా అడ్డుకోలేకపోయారు.

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. గుజరాత్ పేసర్లు కగిసో రబాడ, జేసన్ హోల్డర్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. రబాడ 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, హోల్డర్ 20 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి సన్ రైజర్స్ వెన్నుముక విరిచారు. ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఎస్‌ఆర్‌హెచ్ కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. కెప్టెన్ కమిన్స్ చేసిన 19 పరుగులే జట్టులో అత్యధిక స్కోరు అంటే బ్యాటర్ల ప్రదర్శన ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మెగా లీగ్ చరిత్రలో వరుసగా ఐదు విజయాలు నమోదు చేయడం జీటీకి ఇది రెండోసారి. అద్భుత స్పెల్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన కగిసో రబాడకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

Tags:    

Similar News