IPL 2026: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!
హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది! లీగ్‌లో మరో హై-వోల్టేజ్ సమరానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా.. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 పోరుకు సర్వం సిద్ధమైంది. ఈ ‘చావో రేవో’ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. గ్రాండ్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది.
రెండు జట్ల జర్నీని పరిశీలిస్తే.. క్వాలిఫయర్-1లో ఆర్‌సీబీ చేతిలో దారుణంగా ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఆర్‌సీబీ పూర్తి ఆధిపత్యం చెలాయించడంతో.. 2022 ఛాంపియన్స్ అయిన గుజరాత్‌కు గట్టి షాక్ తగిలింది. అయితే, ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరడమే కాదు.. ఆర్‌సీబీపై ప్రతీకారం తీర్చుకోవాలని శుభ్‌మన్ గిల్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించిన రాజస్థాన్ రాయల్స్.. ఫుల్ కాన్ఫిడెన్స్‌తో క్వాలిఫయర్-2లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఫామ్‌లో ఉండటం రాయల్స్ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తోంది.
ఇక హెడ్ టు హెడ్ రికార్డులను చూస్తే.. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు మొత్తం 10 మ్యాచులలో తలపడగా.. అందులో గుజరాత్ టైటాన్స్ ఏకంగా 7 విజయాలు సాధించింది. రాజస్థాన్ రాయల్స్ కేవలం 3 మ్యాచుల్లోనే గెలిచింది. రికార్డుల పరంగా గుజరాత్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ... ప్రస్తుత ఫామ్, విన్నింగ్ మూమెంటం రాజస్థాన్ వైపు ఉండటంతో, ఈ మ్యాచ్‌లో నెక్-టు-నెక్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది.