IPL 2026: ఉప్పల్ లో హై వోల్టేజ్ మ్యాచ్..RCBని కొట్టి SRH టాప్-2 లోకి వెళ్తుందా?
RCBని కొట్టి SRH టాప్-2 లోకి వెళ్తుందా?
IPL 2026: ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు ఐపీఎల్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన, హై-వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో.. మూడో స్థానంలో ఉన్న మన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీకొట్టబోతోంది. ఇప్పటికే ఈ రెండు జట్లూ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిపోయినప్పటికీ.. ఈ మ్యాచ్ మాత్రం ఇరు జట్లకు ఎంతో కీలకం!
ఎందుకంటే.. సన్‌రైజర్స్ కన్ను ఇప్పుడు ‘టాప్-2’ స్థానంపై పడింది. ప్లేఆఫ్స్‌లో టాప్-2 లో నిలిచిన జట్లకు ‘క్వాలిఫైయర్-1’ ఆడే అవకాశం లభిస్తుంది. అందులో గెలిస్తే నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లొచ్చు. ఒకవేళ ఓడిపోయినా ఫైనల్‌కు వెళ్లడానికి ‘క్వాలిఫైయర్-2’ రూపంలో మరో ఛాన్స్ ఉంటుంది. నిన్ననే చెన్నైపై భారీ తేడాతో గెలిచిన గుజరాత్ టైటాన్స్.. 18 పాయింట్లు, మెరుగైన నెట్ రన్ రేట్‌తో సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేసింది. ఇప్పుడు ఆ జీటీని వెనక్కి నెట్టి ఎస్‌ఆర్‌హెచ్ టాప్-2 లోకి వెళ్లాలంటే.. ఈరోజు ఆర్‌సీబీపై భారీ మార్జిన్‌తో గెలవడంతో పాటు రన్ రేట్‌ను కూడా భారీగా పెంచుకోవాల్సిందే!
టాప్-2 ఛాన్స్ కోసం సన్‌రైజర్స్ ఈరోజు ఊహించని రీతిలో అగ్రెసివ్ క్రికెట్ ఆడబోతోంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా లాంటి హార్డ్ హిట్టర్లతో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. అయితే, స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్‌లోనైనా ఫామ్‌లోకి వచ్చి పరుగుల విధ్వంసం సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో యువ బౌలర్లతో పాటు.. ఈ సీజన్ హయ్యెస్ట్ వికెట్ టేకర్, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ హైదరాబాద్‌కు ప్రధాన బలంగా మారాడు.
కానీ, సన్‌రైజర్స్‌కు డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీని ఢీకొట్టడం అంత ఈజీ కాదు. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసం ఆర్‌సీబీది. పైగా వరుస సెంచరీలు, హాఫ్ సెంచరీలతో భీభత్సమైన ఫామ్‌లో ఉన్న రన్ మెషిన్ విరాట్ కోహ్లీని అడ్డుకోవడం హైదరాబాద్ బౌలర్లకు పెద్ద సవాలే! అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లీ బ్యాటింగ్‌ను కళ్లారా చూసేందుకు ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఈ సీజన్‌లో ఉప్పల్‌లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో పాటు.. ప్రత్యర్థి ఆర్‌సీబీ కావడంతో టికెట్లకు రికార్డు స్థాయిలో హై డిమాండ్ ఏర్పడింది.