IPL 2026: ఇషాన్ కిషన్ విధ్వంసం..హైదరాబాద్ రికార్డ్ విక్టరీ

హైదరాబాద్ రికార్డ్ విక్టరీ

Update: 2026-05-23 07:07 GMT

IPL 2026: ఐపీఎల్-19 లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు హోమ్ గ్రౌండ్‌లో పరుగుల సునామీ సృష్టించారు! బ్యాటింగ్‌లో దుమ్మురేపుతూ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, లీగ్ స్టేజ్‌ను విక్టరీతో ముగించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. హెడ్ 26 రన్స్ చేసి అవుటైనా.. అభిషేక్ శర్మ మాత్రం సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. మొత్తంగా 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 పరుగులు దంచికొట్టాడు!

ఆ తర్వాత అసలైన వినోదం మొదలైంది. ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ ఆర్సీబీ బౌలర్లను ఆటాడేసుకున్నారు. క్లాసెన్ కేవలం 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 51 రన్స్ చేయగా.. మ్యాచ్ హైలైట్‌గా నిలిచిన ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో ఏకంగా 79 పరుగులు సాధించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖర్లో నితీశ్ రెడ్డి 29 రన్స్‌తో నాటౌట్‌గా నిలవడంతో.. హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇక 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లో 44 రన్స్‌తో మెరుపు ఆరంభం ఇచ్చాడు. కానీ, మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ కేవలం 15 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. దేవదత్ పడిక్కల్ సైతం 21 రన్స్‌కే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రజత్ పటీదార్ 56 రన్స్, క్రునాల్ పాండ్యా 41 రన్స్‌తో పోరాడినప్పటికీ.. అప్పటికే రన్ రేట్ భారీగా పెరిగిపోయింది.

చివర్లో టిమ్ డేవిడ్ ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈషాన్‌ మలింగ 2 వికెట్లతో చెలరేగడంతో.. ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్ 55 రన్స్ తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

Tags:    

Similar News