IPL 2026: బట్లర్ సిక్సర్ల సునామీ: టీ20ల్లో 600 సిక్సుల రికార్డు!
టీ20ల్లో 600 సిక్సుల రికార్డు!
IPL 2026: టీ20 క్రికెట్ అంటేనే సిక్సర్ల సునామీ! మైదానంలో బంతి గాల్లోకి లేచిందంటే చాలు.. స్టేడియం మొత్తం హోరెత్తిపోవాల్సిందే. ఇప్పటివరకు సిక్సర్ల రికార్డులంటే కేవలం వెస్టిండీస్ పవర్ హిట్టర్ల పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ ఇప్పుడు ఆ రికార్డుల కోటను బద్దలు కొడుతూ ఒక ఇంగ్లీష్ బ్యాటర్ చరిత్ర సృష్టించాడు. అతనే గుజరాత్ టైటాన్స్ విధ్వంసకర వీరుడు జోస్ బట్లర్!
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో బట్లర్ తన బ్యాట్‌తో శివతాండవం చేశాడు. కేవలం 27 బంతుల్లోనే 52 పరుగులు సాధించి జట్టుకు గట్టి పునాది వేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ ఐదు సిక్సర్లతోనే బట్లర్ టీ20 క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
టీ20 ఫార్మాట్‌లో 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి 'నాన్-విండీస్' (Non-West Indies) ప్లేయర్‌గా బట్లర్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన వారంతా కరేబియన్ దీవులకు చెందినవారే. క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, నికోలస్ పూరన్ లాంటి విండీస్ వీరుల సరసన ఇప్పుడు బట్లర్ వచ్చి చేరాడు. తన 496వ మ్యాచ్‌లోనే ఈ ఫీట్ సాధించడం బట్లర్ కన్సిస్టెన్సీకి నిదర్శనం.
ఒకసారి మనం ఈ ఆల్-టైమ్ సిక్సర్ల లిస్టును చూస్తే.. 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ 1,056 సిక్సర్లతో అజేయంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత పొలార్డ్, రస్సెల్ వంటి వారు ఉన్నారు. అయితే విండీస్ పవర్ హిట్టర్లు కాని ఆటగాళ్లలో, ముఖ్యంగా క్లాస్ ప్లస్ మాస్ కలగలిసిన బ్యాటింగ్‌తో 600 సిక్సర్లు కొట్టడం బట్లర్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.