IPL 2026: కేఎల్ రాహుల్ సరికొత్త ప్రపంచ రికార్డు
ప్రపంచ రికార్డు
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆదివారం (మే 24) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. ఈడెన్ గార్డెన్స్‌లో అజింక్య రహానే కెప్టెన్సీలోని కోల్‌కతా జట్టుపై కేవలం 30 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో రాహుల్ కొట్టిన 4 సిక్సర్ల సాయంతో ఈ సీజన్‌లో ఆయన మొత్తం సిక్సర్ల సంఖ్య 31కి చేరింది. ఈ ఘనతతో ఐపీఎల్ చరిత్రలోనే మూడు వేర్వేరు జట్ల తరపున ఒకే సీజన్‌లో 30 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటగాడిగా కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించారు.
రాహుల్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, మరియు లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ఆడారు. గతంలో ఆయన పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతూ 2018 సీజన్‌లో 32 సిక్సర్లు, అలాగే 2021 సీజన్‌లో 30 సిక్సర్లు కొట్టారు. ఆ తర్వాత 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతూ మరోసారి 30 సిక్సర్ల మార్కును అందుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కూడా 30కి పైగా సిక్సర్లు కొట్టడంతో ఈ అరుదైన రికార్డు ఆయన ఖాతాలో చేరింది.
ఐపీఎల్ చరిత్రలో విధ్వంసకర బ్యాటర్లు క్రిస్ గేల్ (ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ తరపున), గ్లెన్ మాక్స్‌వెల్ (పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ తరపున) రెండేసి వేర్వేరు జట్ల తరపున ఒకే సీజన్‌లో 30కి పైగా సిక్సర్లు కొట్టారు. కానీ ఏ ఆటగాడు కూడా మూడు వేర్వేరు జట్ల తరపున ఈ ఘనత సాధించలేకపోయారు.
తాజా రికార్డుతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఒకే ఐపీఎల్ సీజన్‌లో 30 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా కూడా రాహుల్ నిలిచారు. అంతకుముందు రిషబ్ పంత్ మాత్రమే ఢిల్లీ తరపున ఈ మైలురాయిని దాటారు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో లక్నో జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్, గతంలో 2018 సీజన్‌లో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున 14 మ్యాచ్‌లు ఆడి 37 సిక్సర్లు బాదారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఒక సీజన్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో పంత్, రాహుల్ తర్వాత ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (2024 సీజన్‌లో 28 సిక్సర్లు) మూడో స్థానంలో ఉన్నారు.