IPL 2026: ధోనీ ఫ్యాన్స్‌కు షాక్: ఢిల్లీ మ్యాచ్‌కు కూడా తలా దూరం!
ఢిల్లీ మ్యాచ్‌కు కూడా తలా దూరం!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా సాగుతున్నా సీఎస్కే అభిమానులకు మళ్ళీ నిరాశే ఎదురైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ.. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే కీలక పోరుకు కూడా దూరం కానున్నాడు.
సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ శిబిరం నుంచి అందిన సమాచారం ప్రకారం.. ధోనీ ఈ మ్యాచ్ కోసం జట్టుతో కలిసి ఢిల్లీకి ప్రయాణించలేదు. గత కొంతకాలంగా కాలిపిక్క గాయంతో బాధపడుతున్న ఆయన, ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ధోనీ జట్టుకు దూరంగా ఉండి, తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. దీంతో ఢిల్లీ స్టేడియంలో ధోనీ మెరుపులు చూద్దామనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశ తప్పడం లేదు.
ఈ విషయంపై సీఎస్కే బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీ అప్‌డేట్ ఇవ్వడం నా స్థాయికి మించిన విషయం అంటూనే.. ఆయన ప్రస్తుత పరిస్థితిని వివరించారు. "ధోనీ ప్రస్తుతం మాతో లేరు, కానీ గాయం నుండి క్రమంగా కోలుకుంటున్నారు. తను ఎప్పుడు సిద్ధంగా ఉంటారో, ఎప్పుడు బరిలోకి దిగాలో ఆయనకు బాగా తెలుసు" అని సిమన్స్ పేర్కొన్నారు. జట్టు మేనేజ్‌మెంట్ , వైద్యులు కూడా టోర్నీ కీలక దశలో ఉన్నందున, ధోనీ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్నారు.
ధోనీ లేని సీఎస్కేను ఊహించుకోవడం అభిమానులకు కష్టంగానే ఉంది. గాయం తీవ్రత దృష్ట్యా ఆయనకు విశ్రాంతినివ్వడమే సరైన నిర్ణయమని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మరి ధోనీ తదుపరి మ్యాచ్ కల్లా ఫిట్‌నెస్ సాధించి మైదానంలోకి అడుగుపెడతారా? 'తలా' బ్యాటింగ్ విధ్వంసాన్ని మనం ఎప్పుడు చూస్తాం? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.