IPL 2026: వరుస ఓటములతో పంజాబ్ బేజారు.. ప్లేఆఫ్స్ రేసులో నిలిచేనా?

ప్లేఆఫ్స్ రేసులో నిలిచేనా?

Update: 2026-05-14 12:52 GMT

IPL 2026: బంతితో, బ్యాటుతో తిరుగులేని ఆధిపత్యం.. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో అజేయ విజయాలు! ఐపీఎల్-19లో ఒక దశలో పంజాబ్ కింగ్స్ జోరు చూస్తుంటే.. ప్లేఆఫ్స్‌ చేరడం కేవలం లాంఛనమే అనుకున్నారంతా. కానీ, సీన్ కట్ చేస్తే.. సీన్ రివర్స్ అయింది!

అనూహ్యంగా తడబడిన పంజాబ్.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలై ఇప్పుడు ప్లేఆఫ్స్‌ బెర్తు కోసం పోరాడాల్సిన క్లిష్ట పరిస్థితికి చేరుకుంది. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఉన్న ఆ జట్టుకు, ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కనీసం రెండు విజయాలు అత్యవసరం. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ ముంబయి ఇండియన్స్‌తో పంజాబ్ తలపడనుంది.

ఈ పరాభవ పరంపరకు పంజాబ్ ఎలా అడ్డుకట్ట వేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టోర్నీ ప్రథమార్ధంలో బలమైన బ్యాటింగ్‌తో నెగ్గుకొచ్చిన పంజాబ్‌కు.. ఇప్పుడు బౌలింగ్ లోపాలు శాపంగా మారాయి. ముఖ్యంగా ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో మంచి స్కోరు చేసినా.. చివరి ఓవర్లలో పేసర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో దెబ్బతింది. ఈ సీజన్‌లో అత్యంత పేలవ ఎకానమీ ఉన్న పేస్ దళం అర్ష్‌దీప్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్‌దే కావడం గమనార్హం. అర్ష్‌దీప్ సింగ్ ఓవర్‌కు పదికి పైగా పరుగులిస్తూ ధారాళంగా పాయింట్లు ఇచ్చేస్తున్నాడు.

మరోవైపు, పంజాబ్ ఫీల్డింగ్ కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ తిరిగి ఫామ్‌లోకి రావాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.

ఇక ప్రత్యర్థి ముంబయి ఇండియన్స్ విషయానికి వస్తే.. ఈ టోర్నీలో ఆ జట్టు ప్రదర్శన అత్యంత పేలవం. ఇప్పటికే 8 పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, కోల్పోయేదేమీ లేదు అనే స్థితిలో ఉన్న ముంబయి.. ఇప్పుడు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. అదే జరిగితే పంజాబ్ కింగ్స్‌కు ముప్పు తప్పదు! గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్ హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్‌లోనైనా బరిలోకి దిగుతాడో లేదో వేచి చూడాలి.

ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ నిలుస్తుందా? లేక ముంబయి దెబ్బకు వెనకబడుతుందా? తెలియాలంటే ఇవాళ్టి పోరు చూడాల్సిందే!

Tags:    

Similar News