IPL 2026: రింకూ విధ్వంసం: కేకేఆర్ ఖాతాలో తొలి విక్టరీ

కేకేఆర్ ఖాతాలో తొలి విక్టరీ

Update: 2026-04-20 04:34 GMT

IPL 2026: ఐపీఎల్ 2026లో గెలుపు అసాధ్యం అనుకున్న వేళ.. కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుతాన్ని సృష్టించింది. రాజస్థాన్ రాయల్స్ నోటికాడ ముద్దను లాగేస్తూ.. కేకేఆర్ అద్భుత విజయాన్ని అందుకుంది. పతనం అంచున ఉన్న జట్టును రింకూ సింగ్ తన వీరోచిత పోరాటంతో గట్టెక్కించాడు. ఈ సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్‌కు ఇది కేవలం విజయం మాత్రమే కాదు గ్రాండ్ కమ్‌బ్యాక్!

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 156 పరుగులు చేసింది. లక్ష్యం చిన్నదే అయినా.. ఛేదనలో కేకేఆర్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి కేకేఆర్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 70 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టేడియంలో ఉన్న అభిమానులందరూ ఇక కేకేఆర్ పని అయిపోయింది అనుకుంటున్న తరుణంలో అసలు ఆట మొదలైంది.

ఆ దశలో క్రీజులోకి వచ్చిన ‘మిస్టర్ ఫినిషర్’ రింకూ సింగ్, అతనికి తోడుగా అనుకుల్ రాయ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రింకూ తనదైన శైలిలో బౌండరీలతో విరుచుకుపడగా.. అనుకుల్ రాయ్ ఆచితూచి ఆడుతూ అతనికి సహకరించాడు. రింకూ సింగ్ కేవలం కొన్ని బంతుల్లోనే అజేయంగా 53 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అటు అనుకుల్ రాయ్ కూడా కీలకమైన 29 పరుగులతో రాణించడంతో, వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు ఏకంగా 76 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

రాజస్థాన్ బౌలర్ల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తూ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన ఈ జోడీ, కేకేఆర్‌కు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో కేకేఆర్ విక్టరీ జెండా ఎగురవేసింది. ఈ విజయంతో కేకేఆర్ క్యాంప్‌లో మళ్ళీ జోష్ నెలకొంది.

Tags:    

Similar News