IPL 2026: హిట్‌మ్యాన్ విధ్వంసం, రికెల్టన్ గర్జన: లక్నోపై ముంబై గ్రాండ్ విక్టరీ!
లక్నోపై ముంబై గ్రాండ్ విక్టరీ!
IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి పరుగుల సునామీ ఊగింది. లక్నో సూపర్ జెయింట్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన పోరు కేవలం మ్యాచ్ కాదు.. అదొక హై-వోల్టేజ్ థ్రిల్లర్! భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తమదైన శైలిలో విరుచుకుపడి, 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ముంబై బౌలర్లను ఆడుకున్నారు. ముఖ్యంగా నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోర్, ఏకంగా 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా మిచెల్ మార్ష్ 44 పరుగులు, హిమ్మత్ సింగ్ 40 పరుగులతో మెరుపులు మెరిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో కోర్బిన్ బాష్ రెండు వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు.
229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ ,ర్యాన్ రికెల్టన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ తన పాత రోజులను గుర్తు చేస్తూ 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 84 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. మరోవైపు ర్యాన్ రికెల్టన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 32 బంతుల్లోనే 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 83 పరుగులు చేసి లక్నో బౌలర్ల పని పట్టాడు. వీరిద్దరి ధాటికి లక్నో నిర్దేశించిన కొండంత లక్ష్యం చిన్నబోయింది.
ముంబై ఇండియన్స్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే, అంటే 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ర్యాన్ రికెల్టన్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ విజయం ముంబై అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.