IPL 2026: వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు కేవలం పాయింట్ల పట్టికలోనే కాదు, చరిత్రలోనూ ఆర్సీబీకి ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టింది. ఐపీఎల్‌లో ఒక అరుదైన మైలురాయిని చేరుకుంటూ, ఆర్సీబీ ఇప్పుడు దిగ్గజ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రికార్డును సమం చేసింది.
భారీ స్కోర్లను కాపాడుకోవడంలో ఆర్సీబీ ఇప్పుడు కింగ్ అనిపించుకుంటోంది. ఐపీఎల్ చరిత్రలో 200 అంతకంటే ఎక్కువ స్కోర్‌ను నమోదు చేసిన తర్వాత, దానిని సక్సెస్‌ఫుల్‌గా డిఫెండ్ చేసుకొని అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ఆర్సీబీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు 23 విజయాలతో సీఎస్‌కే సరసన ఆర్సీబీ నిలిచింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ 18 విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ చెరో 15 విజయాలతో కొనసాగుతున్నాయి. ఆర్సీబీ బౌలింగ్ విభాగం ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోగలదని ఈ గణాంకాలే చెబుతున్నాయి.
ఒకప్పుడు వాంఖడే స్టేడియం అంటే ఆర్సీబీకి ఒక పెద్ద గండంలా ఉండేది. 2016 నుంచి ముంబై చేతిలో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిపోయిన చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది! అదే మైదానంలో ముంబైపై ఇది ఆర్సీబీకి వరుసగా రెండో విజయం కావడం విశేషం. ముంబై కోటను బద్దలు కొట్టి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు బెంగళూరు బుల్స్. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ టోర్నీలో ఆర్సీబీకి ఇది వరుసగా నాలుగో విజయం!