IPL 2026: ఆర్సీబీ విశ్వరూపం.. 75 పరుగులకే కుప్పకూలిన క్యాపిటల్స్

75 పరుగులకే కుప్పకూలిన క్యాపిటల్స్

Update: 2026-04-28 06:40 GMT

IPL 2026: డిఫెండింగ్ ఛాంపియన్ అంటే ఇలాగే ఉండాలి! ఐపీఎల్ 19వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో RCB పూర్తి ఏకపక్ష విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లను RCB బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టి, చిత్తుగా ఓడించారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభంలోనే చుక్కలు కనిపించాయి. లీగ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్ స్పెల్స్‌తో జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ విరుచుకుపడ్డారు. వీరి ధాటికి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. అభిషేక్ పోరెల్ 30 పరుగులు, డేవిడ్ మిల్లర్ 19, జేమీసన్ 12 పరుగులు చేసి కాస్త ప్రతిఘటించినా.. మిగిలిన వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా ఢిల్లీ కేవలం 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. సుయాశ్ శర్మ, క్రునాల్ పాండ్యా కూడా పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసి ఢిల్లీని కోలుకోనివ్వలేదు.

76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు.. ఆ లక్ష్యాన్ని ఆషామాషీగా ఊది పారేసింది. కేవలం 6.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసింది. యంగ్ సెన్సేషన్ దేవదత్ పడిక్కల్ కేవలం 13 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 15 బంతుల్లో 23 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వీరిద్దరి మెరుపు దాడితో మ్యాచ్ చాలా త్వరగా ముగిసిపోయింది.

ఈ విజయంతో RCB తన జోరును కొనసాగిస్తుంటే, ఢిల్లీకి ఇది వరుసగా మూడో ఓటమి. ఢిల్లీ నడ్డి విరిచిన స్పెల్‌తో ఆకట్టుకున్న జోష్ హేజిల్‌వుడ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.

Tags:    

Similar News