IPL 2026: CSK vs GT: సాయి సుదర్శన్ సిక్సర్ల తుఫాన్ ..చెన్నైపై గుజరాత్ ఘనవిజయం

చెన్నైపై గుజరాత్ ఘనవిజయం

Update: 2026-04-27 04:34 GMT

IPL 2026: ఐపీఎల్-19లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న గుజరాత్ టైటాన్స్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించి, అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. అటు బౌలింగ్‌లో రబాడా పంజా విసిరితే, ఇటు బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ మెరుపులు మెరిపించాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో చెన్నై బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే, ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రుతురాజ్ ఒంటరి పోరాటం చేయడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేయగలిగింది. మిగతా బ్యాటర్లు విఫలం కావడం చెన్నై స్కోరుపై ప్రభావం చూపింది.

ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా కగిసో రబాడా తన వేగంతో చెన్నైని కోలుకోలేని దెబ్బ తీశాడు. కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి చెన్నై భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. రబాడాకు తోడుగా మిగతా బౌలర్లు కూడా రాణించడంతో చెన్నై మోస్తరు స్కోరుకే పరిమితమైంది. తన అద్భుత స్పెల్‌కు గాను రబాడాకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుండే దూకుడు ప్రదర్శించింది. యువ సంచలనం సాయి సుదర్శన్ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 46 బంతుల్లోనే 4 ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లతో 87 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. అతనికి తోడుగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 33 పరుగులు, జోస్ బట్లర్ అజేయంగా 39 పరుగులు చేయడంతో.. గుజరాత్ కేవలం 16.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ 8 వికెట్ల తేడాతో సాధించిన విజయం గుజరాత్ టైటాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వరుస ఓటముల తర్వాత గాడిలో పడ్డ టైటాన్స్.. మున్ముందు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News