IPL 2026: తొలి కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు!
సరికొత్త రికార్డు!
IPL 2026: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ 2026 రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న గిల్.. క్లాసిక్ షాట్లతో రాజస్థాన్ బౌలర్లను నలుమూలలా బాదాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలోనే ప్లేఆఫ్స్ (Playoffs) మ్యాచ్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా గిల్ రికార్డులకెక్కాడు. అంతేకాకుండా, ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా కూడా గిల్ సరికొత్త చరిత్ర లిఖించాడు.
ఈ తాజా సెంచరీతో ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ ఐదో సెంచరీతో సంజూ శాంసన్ సరసన చేరాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ చెరో 6 సెంచరీలతో, గిల్ సహచర ఆటగాడు జోస్ బట్లర్ 7 సెంచరీలతో, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 9 సెంచరీలతో ముందున్నారు. అలాగే, గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా గిల్ తన పాత రికార్డును తానే తిరగరాశాడు. గతంలో 2023 ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై అహ్మదాబాద్‌లో గిల్ 49 బంతుల్లో చేసిన సెంచరీయే ఇప్పటివరకు రికార్డుగా ఉండేది.
ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా గిల్ ముందడుగు వేశాడు. కెప్టెన్‌గా గిల్‌కు ఇది రెండో సెంచరీ కాగా.. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ (3 సెంచరీలు), విరాట్ కోహ్లీ (5 సెంచరీలు) మాత్రమే అతనికంటే ముందున్నారు. ఈ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లో 104 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని ఖాయం చేసిన తర్వాత గిల్.. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో 15వ ఓవర్లో అవుటయ్యాడు.
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 104), సాయి సుదర్శన్ (32 బంతుల్లో 58) కలిసి కేవలం 77 బంతుల్లోనే 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. గిల్, సుదర్శన్ బ్యాటింగ్ చేసిన తీరు క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సాంప్రదాయ క్రికెట్ షాట్లతో ఫీల్డర్ల మధ్యలో నుండి బౌండరీలు రాబట్టడంలో వీరిద్దరూ అద్భుత నైపుణ్యం కనబరిచారు. ముఖ్యంగా గిల్ తనకిష్టమైన 'పుల్ షాట్'ను జోఫ్రా ఆర్చర్ లాంటి ఎక్స్‌ప్రెస్ ఫాస్ట్ బౌలర్ పైనా అలవోకగా ఆడాడు. అలాగే స్పిన్నర్లపై చక్కటి ఫుట్‌వర్క్ ఉపయోగించి ఫోర్లు కొట్టిన గిల్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్ మీదుగా బౌండరీ బాది తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ 2026 సీజన్‌లో గిల్ కనబరుస్తున్న అద్భుత ఫామ్‌ను చూస్తుంటే, గత టీ20 ప్రపంచకప్‌లో చోటు కోల్పోయిన అతను, తిరిగి భారత టీ20 జట్టులోకి అడుగుపెట్టడానికి బలమైన పునాది వేసుకున్నాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.