IPL, DPL Fixing Allegations: ఐపీఎల్, డీపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. మౌనం వీడిన యువ క్రికెటర్ వంశ్ బేడీ..
యువ క్రికెటర్ వంశ్ బేడీ..
IPL, DPL Fixing Allegations: భారత క్రికెట్‌లో మరోసారి ఫిక్సింగ్ భూతం కలకలం రేపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టోర్నీలలో మ్యాచ్ ఫిక్సింగ్, ప్లేయింగ్-11 లీక్‌లకు సంబంధించిన వ్యవహారాలపై ఓ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ పెను దుమారం రేపింది. ఈ స్టింగ్‌లో మాజీ రంజీ క్రికెటర్ రచిత్ భాటియా చేసిన సంచలన వ్యాఖ్యల ఆధారంగా, సోషల్ మీడియాలో యువ వికెట్ కీపర్-బ్యాటర్ వంశ్ బేడీ పేరు తెరపైకి వచ్చింది. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన 23 ఏళ్ల వంశ్ బేడీ, ఇవన్నీ నిరాధారమైన అసత్య ప్రచారాలని కొట్టిపారేస్తూ లీగల్ యాక్షన్ తీసుకుంటానని స్పష్టం చేశారు.
తహల్కా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో మాజీ రంజీ క్రికెటర్ రచిత్ భాటియా మాట్లాడుతూ.. లండన్‌లోని బుకీలకు ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్-11 వివరాలను టాస్‌కు ముందే లీక్ చేసి ఒక్కో మ్యాచ్‌కు రూ. 60 లక్షల చొప్పున మొత్తం రూ. 3 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నారు. అలాగే డీపీఎల్ టోర్నీలోనూ సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టు సమాచారాన్ని అందించినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ సమాచారాన్ని సీఎస్‌కే జట్టులో ఉండి, ప్రస్తుతం డీపీఎల్‌లో ఆడుతున్న ఢిల్లీకి చెందిన ఓ యువ క్రికెటర్ తనకు అందించాడని ఆ స్టింగ్‌లో భాటియా పేర్కొన్నప్పటికీ, నేరుగా ఎవరి పేరూ ప్రస్తావించలేదు. కానీ సోషల్ మీడియాలో నెటిజన్లు సీఎస్‌కే మాజీ ఆటగాడైన వంశ్ బేడీ వైపే వేలెత్తి చూపుతూ పోస్టులు పెట్టడంతో ఈ వివాదం తీవ్రరూపం దాల్చింది.
ఈ పరిణామాలపై వంశ్ బేడీ సోషల్ మీడియా వేదికగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. "సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో నాపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయి. తహల్కా స్టింగ్ ఆపరేషన్‌లో మాజీ రంజీ క్రికెటర్ రచిత్ భాటియా ప్రస్తావించిన సీఎస్‌కే ఆటగాడిని నేను కాదని స్పష్టం చేస్తున్నాను. అలాంటి ఎలాంటి అక్రమ కార్యకలాపాలతో నాకు సంబంధం లేదు" అని పేర్కొన్నారు. నిరాధారంగా తన పేరును ఈ వివాదంలోకి లాగడం అత్యంత అవమానకరమని, దీనికి బాధ్యులైన వారిపై తన న్యాయ బృందం సివిల్, క్రిమినల్ చర్యలు చేపడుతోందని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన కోరారు.
మరోవైపు ఈ వ్యవహారంపై ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కూడా స్పందించింది. ప్రస్తుతం బయటకు వచ్చిన నివేదికలన్నీ కేవలం ఆరోపణలు మాత్రమేనని, ఏ అధికారిక సంస్థా వీటిని ధ్రువీకరించలేదని తెలిపింది. విచారణ లేకుండా ఏ ఆటగాడిపై గానీ, ఫ్రాంచైజీపై గానీ ఒక నిర్ధారణకు రావడం సరైంది కాదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల జరిగిన డీపీఎల్‌లో అనుమానాస్పద అంశాలు ఏవైనా ఉంటే పరిశీలించాలని సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు డీడీసీఏ వర్గాలు వెల్లడించాయి.