Duleep Trophy: దులీప్ ట్రోఫీలో ఇషాన్ కిషన్ కొత్త రికార్డు.. ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు!
ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు!
Duleep Trophy: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఇషాన్ కిషన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈస్ట్ జోన్ తరఫున సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 270 పరుగులు చేసిన ఇషాన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టాడు. గురువారం 98 బంతుల్లో 80 పరుగులు చేశాడు.
దీంతో దులీప్ ట్రోఫీ చరిత్రలో మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే వికెట్ కీపర్-బ్యాటర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రికార్డును బద్దలు కొట్టిన ఇషాన్.. ఇప్పుడు ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
జార్ఖండ్‌కు చెందిన ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఈస్ట్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఫైనల్లో ఇప్పటివరకు అతని ఖాతాలో 350 పరుగులు ఉన్నాయి. దీంతో ఒకే దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న రమణ్ లాంబా రికార్డును ఇషాన్ అధిగమించాడు.
1987 దులీప్ ట్రోఫీ ఫైనల్లో భిలాయ్‌లో నార్త్ జోన్ తరఫున వెస్ట్ జోన్‌పై రమణ్ లాంబా 320 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే 320 పరుగులు చేసిన ఆయనకు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
ఇక గురువారం రెండో ఇన్నింగ్స్‌లో ఇషాన్ 98 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. శిఖర్ మోహన్‌తో కలిసి మూడో వికెట్‌కు 170 బంతుల్లో 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులు చేసిన శిఖర్ మోహన్.. రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులు చేశాడు. అతడికి ఇదే తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్.
ఇషాన్ అద్భుత బ్యాటింగ్‌తో ఈస్ట్ జోన్ ఆధిక్యం 584 పరుగులకు చేరింది. ఇంకా ఐదు వికెట్లు చేతిలో ఉన్నాయి. మ్యాచ్‌కు మరో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ 2026 విజేతగా నిలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత దేశవాళీ రెడ్ బాల్ జోనల్ టోర్నీలో ఇషాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సమయంలోనే ఇలాంటి అద్భుత ప్రదర్శన చేయడం విశేషంగా మారింది.