Shreyas Iyer: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. అసలు కారణం ఇదే!
అసలు కారణం ఇదే!
Shreyas Iyer: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ఆయన దూరం కానున్నారు. అయితే దీనికి గాయం కారణం కాదు. 2026 ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాల్సి ఉండటంతోనే అయ్యర్ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు.
2026 ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ పోటీలు జపాన్‌లోని ఐచి-నగోయాలో జరగనున్నాయి. సెప్టెంబర్ 28న భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడనుంది. అక్టోబర్ 1న సెమీఫైనల్స్, అక్టోబర్ 3న పతక పోటీలు జరగనున్నాయి. మరోవైపు అదే అక్టోబర్ 3న భారత్-వెస్టిండీస్ మధ్య మూడో వన్డే న్యూ చండీగఢ్‌లో జరగనుంది. భారత్ ఆసియా క్రీడల ఫైనల్‌కు చేరితే.. ఒకే రోజు రెండు వేర్వేరు దేశాల్లో రెండు భారత జట్లు మ్యాచ్‌లు ఆడే పరిస్థితి ఏర్పడుతుంది.
ఆసియా క్రీడల్లో క్రికెట్ మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో జరగనున్నాయి. భారత పురుషుల జట్టు సెప్టెంబర్ 22లోపు జపాన్ చేరుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 22న జపాన్‌తో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ తలపడనుంది.
శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉండటంతో పాటు వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నారు. 2025 అక్టోబర్‌లో ఆయనను వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించారు. అయితే ఆసియా క్రీడల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉండటంతో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు మాత్రం అయ్యర్ దూరంగా ఉండనున్నారు.
భారత ఆసియా క్రీడల బృందానికి బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్ జట్లతో పాటు మొత్తం భారత బృందం అత్యుత్తమ ప్రదర్శన ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడాకారుల కష్టపడి చేసిన సాధన, మంచి ప్రిపరేషన్, జట్టులో ఉన్న ఉత్సాహం చూస్తుంటే భారత్ బంగారు పతకాలు సాధిస్తుందని నమ్మకం ఉందని ఆయన అన్నారు.