ISSF World Cup Sensation: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో సంచలనం.. పసిడి పతకం కొల్లగొట్టిన హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్

హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్

Update: 2026-07-28 04:45 GMT

ISSF World Cup Sensation: అంతర్జాతీయ షూటింగ్ వేదికపై భారత్ కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడింది. చైనాలోని హాంగ్‌ఝౌ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) ప్రపంచ కప్‌లో భారత యువ షూటర్, తెలంగాణ తేజం ఇషా సింగ్ అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో పోటీపడిన ఇషా సింగ్.. అగ్రశ్రేణి షూటర్లను వెనక్కి నెట్టి ఏకంగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.

ఈ హోరాహోరీ ఫైనల్ పోరులో మన దేశానికే చెందిన మరో స్టార్ షూటర్, ఒలింపిక్ పతక విజేత మనూ బాకర్‌తో ఇషా సింగ్ గట్టి పోటీ ఎదుర్కొన్నారు. అయితే ఒత్తిడిని పూర్తిగా జయించిన ఈ 21 ఏళ్ల హైదరాబాదీ అమ్మాయి అద్భుతమైన నిలకడను ప్రదర్శించారు. ఫైనల్లో ఏకంగా 40 హిట్స్‌తో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లోనూ భారత షూటర్లు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మనూ బాకర్ 586 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ఇషా సింగ్ 585 పాయింట్లతో రెండో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించారు. అయితే క్వాలిఫికేషన్‌లో రెండో స్థానంలో నిలిచినప్పటికీ.. ఫైనల్ పోరులో మాత్రం ఇషా సింగ్ తన పూర్తి ప్రతిభను చాటుతూ మనూ బాకర్‌ను అధిగమించి గోల్డ్ మెడల్ సాధించారు.

మరోవైపు, కాంస్య పతకం కోసం గట్టిగా పోరాడిన మనూ బాకర్.. షూట్-ఆఫ్ ఉత్కంఠను దాటుకుని 28 హిట్స్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. ప్రపంచ కప్ వేదికపై భారత్‌కు రెండు పతకాలు దక్కడం, ముఖ్యంగా ఇషా సింగ్ స్వర్ణ పతకం సాధించడం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. భవిష్యత్తులోనూ ఈ యువ సంచలనాలు భారత్‌కు మరిన్ని అంతర్జాతీయ పతకాలు అందించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News