Jos Buttler: టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించిన జోస్ బట్లర్
జోస్ బట్లర్
Jos Buttler: ఇంగ్లాండ్ వైట్ బాల్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. బుధవారం (ఆగస్టు 5) 'ది హండ్రెడ్' టోర్నమెంట్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ మరియు వెల్ష్ ఫైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ అరుదైన ఘనతను సాధించారు. కీరన్ పొలార్డ్ పేరిట ఉన్న 14,803 పరుగుల రికార్డును అధిగమించడానికి బట్లర్‌కు 22 పరుగులు అవసరం కాగా, ఆయన ఏకంగా 20 బంతుల్లోనే నాటౌట్‌గా 51 పరుగులు చేసి ఈ చారిత్రక మైలురాయిని చేరుకున్నారు.
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో, 62వ బంతి వద్ద బట్లర్ పొలార్డ్ రికార్డును దాటేశారు. బట్లర్‌కు ఇది 522వ టీ20 మ్యాచ్ కాగా, ఆయన ఇప్పటివరకు 492 ఇన్నింగ్స్‌ల్లో 14,833 పరుగులు సాధించి అగ్రస్థానానికి చేరుకున్నారు. అంతకుముందు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ 746 మ్యాచ్‌ల్లో 663 ఇన్నింగ్స్‌లలో 14,803 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయారు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (14,562 పరుగులు) మూడో స్థానంలో ఉండగా, అలెక్స్ హేల్స్ (14,449), డేవిడ్ వార్నర్ (14,284) తదుపరి స్థానాల్లో ఉన్నారు.
2022లో ఇంగ్లాండ్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన బట్లర్, అంతర్జాతీయ టీ20ల్లో 160 మ్యాచ్‌లలో 4,212 పరుగులు, ది హండ్రెడ్‌లో 31 మ్యాచ్‌ల్లో 1,192 పరుగులు చేశారు. అలాగే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించి 7 సెంచరీలు, 28 అర్ధసెంచరీల సాయంతో 4,646 పరుగులు సాధించారు.
వెల్ష్ ఫైర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బట్లర్ మెరుపు అర్ధశతకం సాధించడంతో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ కేవలం 69 బంతుల్లోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ప్రస్తుత సీజన్‌లో ఎంఎస్‌జి తరఫున 6 మ్యాచ్‌ల్లో 4 అర్ధసెంచరీలతో 277 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచారు. అంతేకాకుండా ది హండ్రెడ్ ఒకే సీజన్‌లో అత్యధికంగా 4 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన డేవిడ్ మలాన్, జేమ్స్ విన్స్ సరసన బట్లర్ కూడా చేరి రికార్డు సమం చేశారు.