Kevin Pietersen: ఐపీఎల్ కోసం నా కెరీర్‌నే త్యాగం చేశా.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు!

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు!

Update: 2026-04-07 08:20 GMT

Kevin Pietersen: ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ తన అంతర్జాతీయ కెరీర్ అకస్మాత్తుగా ముగిసిపోవడంపై సంచలన నిజాలను బయటపెట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆడాలనే తన నిర్ణయం వల్ల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) తనపై కక్ష కట్టిందని, అందుకే తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు. తాజాగా రణవీర్ అల్లాబాడియాతో జరిగిన ఇంటర్వ్యూలో పీటర్సన్ మాట్లాడుతూ.. 2000వ సంవత్సరం చివరలో ఐపీఎల్ ఆడేందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లను ఈసీబీ అనుమతించలేదని, కానీ తాను మాత్రం ఐపీఎల్ వైపు నిలబడటంతో బోర్డుతో విభేదాలు మొదలయ్యాయని వివరించారు.

ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాళ్లందరూ ఐపీఎల్‌లో స్వేచ్ఛగా ఆడుతున్నారంటే దానికి తానే కారణమని పీటర్సన్ గర్వంగా చెప్పారు. "నేను పెద్ద త్యాగాలే చేశాను, నా కెరీర్‌నే పోగొట్టుకున్నాను. నేను ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే బోర్డులోని వారంతా నాకు వ్యతిరేకంగా మారారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కెరీర్ కేవలం 33 ఏళ్ల వయసులోనే ముగిసిందని, వాస్తవానికి తాను 150 నుండి 160 టెస్టులు ఆడి 12 వేల నుండి 13 వేల పరుగులు చేయాల్సి ఉండేవని పీటర్సన్ చెప్పుకొచ్చారు. ఇంగ్లాండ్ తరపున 104 టెస్టులు ఆడిన ఆయన, 47.28 సగటుతో 8,181 పరుగులు సాధించారు. ఇందులో 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

తాను చేసిన పోరాటం వల్లే నేటి తరం ఇంగ్లీష్ క్రికెటర్లు ఐపీఎల్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారని పీటర్సన్ అభిప్రాయపడ్డారు. ఇటీవల జోస్ బట్లర్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు.. తాను చేసిన త్యాగాలకు బట్లర్ కృతజ్ఞతలు తెలిపాడని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తనను ఇబ్బంది పెట్టడానికి బోర్డు మీడియాను కూడా వాడుకుందని, ఆ గొడవలు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయని పీటర్సన్ గుర్తు చేశారు. అయితే గతాన్ని తవ్వుకోవడం ఇష్టం లేదని, ప్రస్తుతం తాను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News