Kranti Goud’s World Cup Magic:క్రాంతి గౌడ్ వరల్డ్ కప్ మ్యాజిక్.. తండ్రికి పోయిన ఉద్యోగం వచ్చింది!

తండ్రికి పోయిన ఉద్యోగం వచ్చింది!

Update: 2025-11-10 03:41 GMT

Kranti Goud’s World Cup Magic: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించిన యువ పేసర్ క్రాంతి గౌడ్ కుటుంబానికి శుభవార్త అందింది. క్రాంతి అద్భుత ప్రదర్శన ఫలితంగా, 2012లో సస్పెండ్ అయిన ఆమె తండ్రి మున్నా సింగ్ గౌడ్‌కు తిరిగి పోలీస్ ఉద్యోగం ఇవ్వాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హామీ ఇచ్చారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన క్రాంతి గౌడ్‌ను ఆదివారం (నవంబర్ 9, 2025) భోపాల్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ, దేశానికే గర్వకారణంగా నిలిచిన క్రాంతి కృషిని కొనియాడారు. అనంతరం, క్రాంతి తండ్రి మున్నా సింగ్ గౌడ్ గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. 2012లో ఎన్నికల డ్యూటీ సమయంలో జరిగిన ఒక వివాదం కారణంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి మున్నా సింగ్ గౌడ్ సస్పెండ్ అయ్యారు.

"క్రాంతి దేశం మొత్తానికే గర్వకారణంగా నిలిచింది. ఆమె తండ్రి గౌరవాన్ని కూడా తిరిగి నిలబెట్టడం మన బాధ్యత" అని సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. నిబంధనల ప్రకారం మున్నా సింగ్ గౌడ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మున్నా సింగ్ గౌడ్ ఉద్యోగం కోల్పోయిన తర్వాత కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడింది. "కొన్ని రోజులైతే మాకు ఒక్క పూట తిండి కూడా దొరికేది కాదు," అని క్రాంతి గతంలో ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంతో తెలిపారు. తన తండ్రి మళ్లీ పోలీస్ యూనిఫామ్ ధరించి గౌరవంగా పదవీ విరమణ చేయాలని ఆమె కలలు కన్నారు. క్రాంతి కలను ముఖ్యమంత్రి నెరవేర్చారు.

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల క్రాంతి గౌడ్, ఈ వరల్డ్ కప్‌లో భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి కీలకంగా మారింది. టోర్నమెంట్‌లో ఆమె 8 మ్యాచ్‌లలో 9 వికెట్లు తీసి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3/20 ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును కూడా గెలుచుకుంది.

Tags:    

Similar News