Lahiru Udara: చరిత్ర సృష్టించిన లహిరు ఉదార.. సనత్ జయసూర్య, కరుణారత్నె రికార్డులు బద్దలు!
రికార్డులు బద్దలు!
Lahiru Udara: యాంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఓపెనర్ లహిరు ఉదార సంచలన బ్యాటింగ్‌తో సరికొత్త చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ మొదటి రోజు ఆటలో భాగంగా కేవలం 248 బంతుల్లోనే 21 ఫోర్లు, 5 సిక్సర్లతో 188 పరుగులు చేసి డబుల్ సెంచరీకి కొద్ది దూరంలో నిలిచిపోయాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడే క్రమంలో అతడు ఐదు భారీ సిక్సర్లు బాదడంతో శ్రీలంక క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
తన కెరీర్‌లో కేవలం మూడో టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడుతున్న 32 ఏళ్ల లహిరు ఉదార, ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు కొట్టిన మొదటి శ్రీలంక ఓపెనింగ్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజ ఓపెనర్ సనత్ జయసూర్య పేరిట ఉన్న పాత రికార్డును అతడు బద్దలు కొట్టాడు. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ కలిగిన జయసూర్య, తన టెస్ట్ కెరీర్‌లో రెండు సార్లు మాత్రమే ఒక ఇన్నింగ్స్‌లో గరిష్టంగా 4 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు ఉదార ఆ మార్కును దాటి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ రికార్డు మాత్రం భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. ముంబైకి చెందిన జైస్వాల్, 2024 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన రాజ్‌కోట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 214 పరుగులు చేసినప్పుడు ఏకంగా 12 సిక్సర్లు బాది వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. జైస్వాల్ కాకుండా ఆస్ట్రేలియా లెజెండ్ మాథ్యూ హేడన్ (2003లో జింబాబ్వేపై 11 సిక్సర్లు), న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (2014లో పాకిస్తాన్‌పై 11 సిక్సర్లు) మాత్రమే ఓపెనర్లుగా ఒకే ఇన్నింగ్స్‌లో 10 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టారు.
సిక్సర్ల రికార్డే కాకుండా లహిరు ఉదార వెస్టిండీస్ గడ్డపై మరో ఘనత కూడా సాధించాడు. వెస్టిండీస్‌పై ఒక టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్‌గా అత్యధిక స్కోరు సాధించిన దిముత్ కరుణారత్నె రికార్డును కూడా అతడు అధిగమించాడు. 2015లో గాలే వేదికగా జరిగిన టెస్టులో కరుణారత్నె విండీస్‌పై 186 పరుగులు చేయగా, ఇప్పుడు ఉదార 188 పరుగులు చేసి ఆ రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. ఉదార వీరోచిత ఇన్నింగ్స్ సాయంతో శ్రీలంక జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోరు సాధించింది.