Manav Suthar: అరంగేట్రంలోనే అదరగొట్టిన మానవ్ సుతార్

మానవ్ సుతార్

Update: 2026-06-09 08:21 GMT

Manav Suthar: టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం (డెబ్యూ) చేయడమే ఏ ఆటగాడికైనా ఒక కల. అలాంటిది తన మొదటి మ్యాచ్‌లోనే అసాధారణ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ (POTM) అవార్డు సొంతం చేసుకోవడం ఒక అరుదైన రికార్డు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ ఈ అద్భుతాన్ని చేసి చూపించాడు.

తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే 7 వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో 6/33, రెండో ఇన్నింగ్స్‌లో 1 వికెట్) చెలరేగి ఆఫ్ఘనిస్తాన్‌ను కుప్పకూల్చాడు. తద్వారా భారత్‌కు ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల భారీ చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ ప్రదర్శనకు గాను ఆయనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దీంతో టెస్ట్ డెబ్యూలోనే ఈ అవార్డు అందుకున్న 9వ భారత క్రికెటర్‌గా మానవ్ సుతార్ ఒక ఎలైట్ క్లబ్‌లో చేరిపోయాడు.

1. ప్రవీణ్ ఆమ్రే (1992 vs సౌతాఫ్రికా)

విదేశీ గడ్డపై, అదీ భయంకరమైన పేస్ బౌలింగ్‌కు అనుకూలించే డర్బన్ పిచ్‌పై ప్రవీణ్ ఆమ్రే తన తొలి టెస్టులోనే 103 పరుగులతో సెంచరీ బాదారు. సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకోవడంలో ఆయన ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. దాంతో ఆయనకు డెబ్యూలోనే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' లభించింది.

2. ఆర్‌పీ సింగ్ (2006 vs పాకిస్థాన్)

ఫైసలాబాద్‌లో బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి ఫ్లాట్ పిచ్‌పై పాకిస్థాన్ 588 పరుగులు భారీ స్కోరు చేసింది. అలాంటి పిచ్‌పై భారత ఫాస్ట్ బౌలర్ ఆర్‌పీ సింగ్ అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 1 వికెట్ తీశారు. మ్యాచ్‌ను డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించి డెబ్యూలోనే ఉత్తమ ఆటగాడిగా నిలిచారు.

3. రవిచంద్రన్ అశ్విన్ (2011 vs వెస్టిండీస్)

భారత దిగ్గజ స్పిన్నర్ ఆర్‌. అశ్విన్ నవంబర్ 2011లో వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేశారు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన ఆయన.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో మాయాజాలం చేశారు. మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టి భారత్‌కు 5 వికెట్ల విజయాన్ని అందించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యారు.

4. శిఖర్ ధావన్ (2013 vs ఆస్ట్రేలియా)

ఆస్ట్రేలియాతో జరిగిన మొహాలీ టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ‘గబ్బర్’ శిఖర్ ధావన్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన డెబ్యూ టెస్ట్ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన కేవలం 174 బంతుల్లో 187 పరుగులు చేసి భారత్ 6 వికెట్ల తేడాతో గెలవడానికి కారణమయ్యారు.

5. రోహిత్ శర్మ (2013 vs వెస్టిండీస్)

ప్రస్తుత టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మ తన తొలి టెస్ట్ మ్యాచ్‌ను ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై ఆడారు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్.. క్లాసిక్ ఇన్నింగ్స్‌తో 177 పరుగులు సాధించారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ మరియు 51 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

6. పృథ్వీ షా (2018 vs వెస్టిండీస్)

సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యంత పిన్న వయసులో టెస్ట్ అరంగేట్రం చేసి సెంచరీ కొట్టిన రెండో భారతీయ బ్యాటర్‌గా పృథ్వీ షా రికార్డు సృష్టించారు. రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌పై తన మొదటి మ్యాచ్‌లోనే వన్డే తరహాలో ఆడి 134 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ మరియు 272 పరుగులతో గెలిచింది.

7. శ్రేయస్ అయ్యర్ (2021 vs న్యూజిలాండ్)

న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో జరిగిన టెస్టులో శ్రేయస్ అయ్యర్ డెబ్యూ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడి 105 పరుగులు చేసిన ఆయన, రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 65 పరుగులు చేశారు. ఈ అద్భుత ప్రదర్శనతో జట్టును ఓటమి నుండి కాపాడి మ్యాచ్‌ను డ్రా చేశారు.

8. యశస్వి జైస్వాల్ (2023 vs వెస్టిండీస్)

యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విండీస్ గడ్డపై కళ్లు చెదిరే రీతిలో టెస్ట్ కెరీర్‌ను ప్రారంభించారు. విండీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ తొలి ఇన్నింగ్స్‌లోనే 171 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడారు. భారత్ ఇన్నింగ్స్ మరియు 141 పరుగుల తేడాతో గెలవడంలో ఆయన పాత్ర ఎనలేనిది.

9. మానవ్ సుతార్ (2026 vs ఆఫ్ఘనిస్తాన్)

ఈ ఎలైట్ లిస్టులో చేరిన సరికొత్త స్టార్ మానవ్ సుతార్. ముల్లాన్‌పూర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టెస్టులో 23 ఏళ్ల ఈ రాజస్థాన్ స్పిన్నర్ మొదటి ఇన్నింగ్స్‌లోనే 6/33 గణాంకాలతో గత 38 ఏళ్లలో భారత డెబ్యూ బౌలర్‌గా అత్యుత్తమ రికార్డు నమోదు చేశాడు. బ్యాటింగ్‌లోనూ 28 పరుగులు చేసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.

Tags:    

Similar News