Messi in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ: ఒక్క ఫొటోకి రూ.9.95 లక్షలు

మెస్సీ: ఒక్క ఫొటోకి రూ.9.95 లక్షలు

Update: 2025-12-11 11:32 GMT

Messi in Hyderabad: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ భారతదేశ పర్యటనలో భాగంగా ఈ నెల 13వ తేదీన (శనివారం) భాగ్యనగరం హైదరాబాద్‌లో అడుగుపెట్టబోతున్నారు. ది గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం నగరంలోని ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మెస్సీని దగ్గరగా చూసే అవకాశం కల్పించడంతో పాటు, ఆయనతో ఒక్క ఫొటో దిగేందుకు నిర్వాహకులు భారీ ధరను నిర్ణయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఫుట్‌బాల్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో మెస్సీతో ఫొటో దిగే అరుదైన అవకాశాన్ని నిర్వాహకులు కల్పిస్తున్నారు. మెస్సీతో ఒక్క ఫొటో లేదా సెల్ఫీ దిగాలంటే సుమారు రూ. 9.95 లక్షలు ప్లస్ జీఎస్టీ (GST) చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. ఈ గోల్డెన్ ఛాన్స్ కేవలం 100 మందికి మాత్రమే పరిమితం చేశారు. ఈ భారీ మొత్తాన్ని చెల్లించిన వారికి మెస్సీతో పాటు, ఆయన సహచర ఆటగాళ్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్లను కలిసే అవకాశం కూడా లభిస్తుంది. నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతి రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఈ టికెట్లను "District" అనే మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

ఉప్పల్ స్టేడియంలో ప్రధాన ఈవెంట్

మెస్సీ పర్యటనలో ప్రధాన కార్యక్రమం ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు జరగనుంది. సింగరేణి ఆర్‌ఆర్‌-9 , అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్ల మధ్య 20 నిమిషాల పాటు ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ చివరి ఐదు నిమిషాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమ జట్టు తరఫున బరిలోకి దిగుతారు. యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా మెస్సీ చిన్నారులకు ఫుట్‌బాల్ మెళకువలు నేర్పిస్తారు (మాస్టర్‌క్లాస్). స్టేడియంలో జరిగే ఈవెంట్‌ను చూడటానికి సాధారణ టికెట్ ధరలు రూ. 1,300 నుండి ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. మెస్సీ సుమారు గంట పాటు ఉప్పల్ స్టేడియంలో గడిపి, రాత్రికి హైదరాబాద్‌లోనే బస చేసి, ఆదివారం ఉదయం ముంబైకి బయలుదేరతారు. మెస్సీ రాకతో హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ సందడి తారాస్థాయికి చేరింది.

Tags:    

Similar News