Mitchell Santner Injured: మిచెల్ సాంట్నర్‌కు గాయం.. కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా శార్దూల్ ఠాకూర్ ఎందుకు వచ్చారు?
కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా శార్దూల్ ఠాకూర్ ఎందుకు వచ్చారు?
Mitchell Santner Injured: ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడటంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే, సాంట్నర్ భుజానికి గాయమైతే, అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’ (మెదడుకు తగిలిన గాయం కారణంగా వచ్చే మార్పు) గా రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఏం జరిగింది?
సీఎస్కే ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో కార్తీక్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడానికి సాంట్నర్ బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన డైవ్ చేశారు. క్యాచ్‌ను విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, ఆ క్రమంలో ఆయన భుజం బలంగా నేలకు తగిలింది. దీంతో ఆయన నొప్పితో విలవిలలాడుతూ మైదానం వెలుపలికి వెళ్లారు. అయితే బ్యాటింగ్ సమయంలో సాంట్నర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ క్రీజులోకి రావడంతో నిబంధనలపై సందేహాలు వ్యక్తమయ్యాయి.
కోచ్ మహేల జయవర్ధనే వివరణ
ఈ విషయంపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే క్లారిటీ ఇచ్చారు. సాంట్నర్ నేలకు డైవ్ చేసినప్పుడు కేవలం భుజం మాత్రమే కాకుండా, తల మరియు మెడ కూడా బలంగా తగిలాయని ఆయన వెల్లడించారు. "సాంట్నర్ డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చాక చాలా తల తిరుగుతున్నట్లు (Dizzy), అస్థిరంగా (Unstable) ఉన్నట్లు చెప్పాడు. అందుకే వెంటనే స్కాన్ కోసం పంపించాం. కన్కషన్ లక్షణాలు కనిపించడంతో మ్యాచ్ రెఫరీ అనుమతితో శార్దూల్ ఠాకూర్‌ను బరిలోకి దించాం" అని జయవర్ధనే వివరించారు.
శార్దూల్‌పై కోచ్ జోక్
ఇదే క్రమంలో జయవర్ధనే సరదాగా స్పందిస్తూ.. "తన బ్యాటింగ్ సామర్థ్యం శార్దూల్ ఠాకూర్‌తో సమానమని తెలిస్తే సాంట్నర్ కొంచెం ఫీలవుతాడు (నవ్వుతూ).. కానీ తప్పదు కదా. సాంట్నర్ త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం" అని వ్యాఖ్యానించారు.
ముంబైకి ఘోర పరాజయం
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ఓటమిని మూటగట్టుకుంది. బౌలింగ్‌లో సాంట్నర్ 4 ఓవర్లలో 44 పరుగులిచ్చి సర్ఫరాజ్ ఖాన్ వికెట్ తీశారు. బ్యాటింగ్‌లో ఆయన స్థానంలో వచ్చిన శార్దూల్ ఠాకూర్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. ముంబై జట్టు కేవలం 104 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది.