Mumbai Indians: రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్..తిలక్ వర్మకు ముంబై కెప్టెన్సీ.?
ముంబై కెప్టెన్సీ.?
Mumbai Indians: ఐపీఎల్ మెగా టోర్నీకి ముందు ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత సీజన్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్య కెప్టెన్సీ, ట్రేడింగ్‌పై ఇప్పుడు భారీ చర్చ నడుస్తోంది. అసలు ముంబయి క్యాంప్‌లో ఏం జరుగుతోంది? భవిష్యత్తు కెప్టెన్ ఎవరనే దానిపై తెలుసుకుందాం.
ముందుగా హార్దిక్ పాండ్యను ట్రేడ్ చేయాలని భావించిన ముంబయి ఇండియన్స్ మేనేజ్‌మెంట్... కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ట్రేడింగ్ ద్వారా సరైన ప్రత్యామ్నాయ ఆటగాడు దొరకకపోవడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. హార్దిక్‌ను ట్రేడ్ చేయకుండా కేవలం ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగించి, కెప్టెన్‌ను మార్చాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం. "ఒక ట్రేడ్ జరగాలంటే చాలా విషయాలు కుదరాలి, ఇది అంత తేలికైన విషయం కాదు అని ఫ్రాంచైజీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మరి కొత్త కెప్టెన్ ఎవరు? ఈ విషయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే రోహిత్, యాజమాన్యంతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నాడట. కెప్టెన్సీ రేసులో సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు యువ ఆటగాడు తిలక్ వర్మ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, యువ సంచలనం తిలక్ వర్మ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, కోచ్ మార్పుపై వస్తున్న వార్తలకు కూడా తెరపడింది. గతంలో మహేల జయవర్ధనెను కోచ్ పదవి నుంచి తొలగిస్తారన్న ప్రచారం జరిగినా... వచ్చే సీజన్‌కు కూడా ఆయనే కోచ్‌గా కొనసాగే అవకాశాలున్నాయి. ఇక స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, అతన్ని వదులుకునే ప్రసక్తే లేదని ముంబయి తేల్చిచెప్పింది. కేవలం ఒక్క ఏడాది ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను పక్కనపెట్టమని, తాము 'వన్ ఫ్యామిలీ' అనే ట్యాగ్‌కు కట్టుబడి ఉంటామని ఫ్రాంచైజీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
చివరి నిమిషంలో ఎలాంటి పెద్ద మార్పులు లేకపోతే, రాబోయే నెలలో ముంబయి ఇండియన్స్ జట్టు ప్రక్షాళనపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.