నా అవసరం కోచ్, కెప్టెన్‌కు అనిపించాలి.. షమీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
షమీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ కెరీర్ ప్రస్తుతం గందరగోళంలో పడింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఫిట్‌నెస్ సమస్యతో జట్టుకు దూరమైన షమీ, ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడంపై తాజాగా స్పందించారు. షమీని జట్టులోకి తీసుకోకపోవడంతో అతడి కెరీర్ దాదాపు ముగిసినట్లేనని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే తాను రంజీ ట్రోఫీలో ఆడి మళ్లీ జాతీయ జట్టులోకి వస్తానని షమీ ధీమా వ్యక్తం చేశారు.
నా అవసరం కోచ్, కెప్టెన్‌కు అనిపించాలి
ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక కాకపోవడంపై సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లు, మీమ్స్‌పై షమీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
"జట్టుకు ఎంపిక చేయడమనేది నా చేతుల్లో ఉండదు. అది సెలక్షన్ కమిటీ బాధ్యత. కోచ్, కెప్టెన్‌కు నా అవసరం ఉందనిపించాలి. వారే నన్ను ఎంపిక చేయాలి. ఇంకాస్త సమయం కావాలని వారు భావిస్తే, అందుకోసం నేను సన్నద్ధంగానే ఉంటా" అని షమీ తెలిపారు.
నా ఫిట్‌నెస్ చాలా బాగుంది!
ఆస్ట్రేలియా సిరీస్‌కు జట్టును ప్రకటించేటప్పుడు సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్.. షమీ ఫిట్‌నెస్‌పై సరైన సమాచారం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై షమీ స్పందిస్తూ.. "నా ఫిట్‌నెస్ చాలా బాగుంది. నేను ఇటీవల దులీప్ ట్రోఫీలో ఆడాను. అక్కడ దాదాపు 35 ఓవర్లపాటు బౌలింగ్ చేశాను. నా బౌలింగ్ లయ కూడా బాగానే ఉంది. నాకు ఎక్కడా సమస్యగా అనిపించలేదు" అని స్పష్టం చేశారు.
కెప్టెన్సీ మార్పు గురించి కూడా మాట్లాడిన షమీ.. శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించడం బీసీసీఐ, సెలక్టర్లు తీసుకున్న నిర్ణయమని, మనం దాన్ని అంగీకరించాల్సిందేనని అన్నారు. కెప్టెన్సీ విషయంలో అనవసరమైన ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదని.. ఇవాళ ఒకరు, రేపు మరొకరు ఉండటం సహజమని వ్యాఖ్యానించారు.