Ridhima Pathak: "నాకు దేశమే ముఖ్యం": బిపిఎల్ హోస్టింగ్ నుండి తప్పుకున్న రిధిమా పాఠక్
బిపిఎల్ హోస్టింగ్ నుండి తప్పుకున్న రిధిమా పాఠక్
Ridhima Pathak: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తనను బిపిఎల్ నుండి తొలగించిందంటూ వస్తున్న వార్తలను రిధిమా పాఠక్ కొట్టిపారేశారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలకే తాను ప్రాధాన్యత ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. "గత కొన్ని గంటలుగా నన్ను బిపిఎల్ నుండి 'తొలగించారు' అనే ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. నేనే స్వయంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు ఎప్పుడూ నా దేశమే మొదటి ప్రాధాన్యత" అని పేర్కొన్నారు.
భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ఇటీవల తలెత్తిన వివాదాలే రిధిమా నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ. 9.2 కోట్లకు కొనుగోలు చేసిన బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు జట్టు నుండి విడుదల చేయడం పెద్ద దుమారం రేపింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి ప్రతిచర్యగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించింది. అంతేకాకుండా, టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచులను భారత్ నుండి తరలించాలని ఐసీసీని కోరింది (దీనిని ఐసీసీ ఇప్పటికే తిరస్కరించింది).
తన వృత్తి పట్ల ఎప్పుడూ గౌరవం, నిజాయితీతో ఉంటానని రిధిమా తెలిపారు. "క్రీడలకు ఎప్పుడూ నిజం అవసరం. నేను ఎల్లప్పుడూ సమగ్రత, క్రీడా స్ఫూర్తికే కట్టుబడి ఉంటాను" అని ఆమె తన ప్రకటనలో వివరించారు. స్టార్ స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్ వంటి సంస్థలతో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న రిధిమా, బిపిఎల్ నుండి తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాకిస్థాన్‌కు చెందిన జైన్ అబ్బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, వకార్ యూనిస్, రమీజ్ రాజా వంటి ప్రముఖులు కామెంటేటర్లుగా ఉన్నారు. రిధిమా కూడా వీరితో చేరాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుత రాజకీయ, క్రీడా ఉద్రిక్తతల దృష్ట్యా ఆమె వెనక్కి తగ్గారు.