Nikhat Zareen Shines in World Cup: ప్రపంచ కప్‌లో నిఖత్ జరీన్ సంచలనం.. భారత్‌కు 9 స్వర్ణాలు, అగ్రస్థానం..
భారత్‌కు 9 స్వర్ణాలు, అగ్రస్థానం..
Nikhat Zareen Shines in World Cup: ప్రపంచకప్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అద్భుత ప్రదర్శనతో మెరిసింది. ఇటీవల ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్న ఈ తెలంగాణ బాక్సర్ మహిళల 51 కేజీల తుదిపోరులో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని మళ్లీ గాడిలో పడింది. ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ 5-0 తేడాతో చైనీస్ తైపీకి చెందిన గవో యీ గ్జువాన్‌ను చిత్తు చేసింది. తొలి రౌండ్ నుంచే పదునైన పంచ్‌లతో ప్రత్యర్థిపై ఎదురుదాడి చేసి, ఆఖరిదాకా అదే జోరు కొనసాగించి సులువుగా విజయాన్ని అందుకుంది. ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌లోనే ఓటమి పాలైన నిఖత్‌కు ఈ విజయం భారీ ఉపశమనాన్ని ఇచ్చింది.
భారత మహిళా బాక్సర్ల అద్భుత ప్రదర్శన
నిఖత్‌తో పాటు భారత మహిళా బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మరో ఆరు పసిడి పతకాలు గెలుచుకున్నారు. 57 కేజీల్లో జైస్మిన్ లాంబోరియా పారిస్ కాంస్య పతక విజేత వుయీ (చైనీస్ తైపీ)ని ఓడించింది. 60 కేజీల్లో పర్వీన్ హుడా జపాన్‌కు చెందిన తగుచి అయాకాను చిత్తు చేయగా, 80 కేజీల్లో నుపుర్ షెరోన్ (ఉజ్బెకిస్థాన్) సొటిమ్‌బొయెవాపై పైచేయి సాధించింది. 70 కేజీల్లో అరుంధతి చౌదరి (ఉజ్బెకిస్థాన్) అజీజాపై గెలుపొందగా, 54 కేజీల్లో ప్రీతి పన్వర్ సిరిన్ (ఇటలీ)పై విజయం సాధించింది. 48 కేజీల్లో మీనాక్షి హుడా కూడా ఫోజిలివా (ఉజ్బెకిస్థాన్)పై గెలిచి పసిడి పతకం సొంతం చేసుకున్నారు.
పురుషుల విభాగంలో స్వర్ణాలు
పురుషుల విభాగంలో కూడా భారత బాక్సర్లు రెండు స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. 70 కేజీల తుదిపోరులో హితేశ్ గులియా కజకిస్థాన్‌కు చెందిన నార్‌బెక్‌పై విజయం సాధించాడు. అలాగే 60 కేజీల్లో సచిన్ సివాచ్ కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన మునార్‌బెక్‌పై గెలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నారు.
మొత్తం 20 పతకాలతో అగ్రస్థానంలో భారత్
ఈ టోర్నీలో భారత్ మొత్తం 20 పతకాలు (9 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు) గెలుచుకుని అగ్రస్థానంతో టోర్నీని ముగించింది. రజత పతకాలు సాధించిన వారిలో జాదుమణి సింగ్ (50 కేజీ), అంకుశ్ (80 కేజీ), పవన్ (55 కేజీ), అబినాష్ (65 కేజీ), పూజ రాణి (80 కేజీ) ఉన్నారు. ఈ అద్భుత ప్రదర్శన భారత బాక్సింగ్ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.