Nitish Rana: ఢిల్లీ చెన్నై మ్యాచ్.. నితీశ్ రాణా ఔట్‌పై వివాదం
నితీశ్ రాణా ఔట్‌పై వివాదం
Nitish Rana: నితీష్ రాణా అవుట్ అయిన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీష్ రాణా స్వీప్ షాట్ ఆడబోయి డీప్ ఫైన్ లెగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగారు. అయితే, రాణా క్యాచ్ చిక్కడానికి ముందే వికెట్లపై బెయిల్స్ కింద పడిపోవడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. బెయిల్స్ ముందే పడిపోయినప్పుడు అంపైర్ దానిని 'డెడ్ బాల్'గా ప్రకటించాల్సిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
కొంతమంది అభిమానులు రాణా 'హిట్ వికెట్' అయ్యారా? లేదా వికెట్ కీపర్ సంజు శాంసన్ పొరపాటున వికెట్లను తాకారా? అని సందేహాలు వ్యక్తం చేశారు. కానీ వాస్తవానికి ఆ సమయంలో ఢిల్లీలో వీచిన బలమైన గాలుల వల్లే బెయిల్స్ కింద పడినట్లు తెలుస్తోంది. బంతి బ్యాటర్‌ను చేరుకోవడానికి ముందే బెయిల్స్ పక్కకు తప్పుకున్నాయని వైరల్ అవుతున్న వీడియోలు సూచిస్తున్నప్పటికీ, ఫీల్డ్ అంపైర్లు మాత్రం దీనిపై జోక్యం చేసుకోలేదు. బ్యాటర్ షాట్ ఆడే క్రమంలో గానీ, పరుగు తీసే క్రమంలో గానీ వికెట్లను తాకలేదు కాబట్టి దీనిని 'హిట్ వికెట్'గా పరిగణించే అవకాశం లేదు.
క్రికెట్ నిబంధనల ప్రకారం, బంతిని వేసే సమయంలో బ్యాటర్ ఏకాగ్రత దెబ్బతిన్నా లేదా ఏదైనా కదలిక వల్ల ఆటంకం కలిగినా అంపైర్ డెడ్ బాల్‌గా ప్రకటించవచ్చు. ఎంసీసీ లా 20.4.2.6 ప్రకారం, బ్యాటర్ బంతిని ఎదుర్కొనే సిద్ధమవుతున్నప్పుడు లేదా ఎదుర్కొంటున్నప్పుడు ఏదైనా శబ్దం లేదా కదలిక వల్ల అసౌకర్యానికి గురైతేనే అది డెడ్ బాల్ అవుతుంది. కానీ ఈ సందర్భంలో బౌలర్ బంతిని విసిరిన తర్వాత బెయిల్స్ పడ్డాయని, దానివల్ల బ్యాటర్‌కు ఎలాంటి ఆటంకం కలగలేదని భావించడం వల్ల అంపైర్లు దానిని డెడ్ బాల్‌గా ఇవ్వలేదు. దీంతో రాణా క్యాచ్ అవుట్ నిర్ణయం సబబేనని నిపుణులు చెబుతున్నారు.