PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు తన కెరీర్‌లోని అత్యంత కష్టకాలంలో మాజీ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు ఏవిధంగా అండగా నిలిచారో గుర్తుచేసుకున్నారు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. కోహ్లీతో తన అనుబంధం గురించి, తాను తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు తన దృక్పథాన్నే పూర్తిగా మార్చేశాయని తెలిపారు.

తాను ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతూ, ఏదీ సరిగ్గా జరగడం లేదని భావించిన సమయంలో కోహ్లీని కలిసినట్లు సింధు వెల్లడించారు. ఆ సమయంలో కోహ్లీ తనకు ఎలాంటి పెద్ద క్లిష్టమైన సలహాలు ఇవ్వలేదని, కేవలం 'మైదానంలోకి వెళ్లి నీ వంతు ప్రయత్నం చేస్తూ ఉండమని' చెప్పారన్నారు.కోహ్లీ నా అన్నయ్య లాంటివారు. నేను చాలా లోయెస్ట్ ఫేజ్‌లో ఉన్నప్పుడు ఆయన్ను కలిశాను. ఏదీ సరిగ్గా జరగట్లేదని చెప్పాను. అప్పుడు ఆయన నాతో.. 'పర్వాలేదు, కేవలం మైదానంలోకి అడుగుపెట్టు, నీ పని నువ్వు చేయి' అని చెప్పారు" అని సింధు గుర్తుచేసుకున్నారు.

"ఎక్కడికైనా, ఏ మ్యాచ్‌కైనా సరే వెళ్లి నీ ఆట నువ్వు ఆడు అని కోహ్లీ చెప్పారు. దానివల్ల నువ్వు నష్టపోయేదేమీ లేదు. నువ్వు ఎంత కష్టపడ్డావో, ఏంటో నీకు తెలుసు. నువ్వు ఎవరో ప్రపంచానికి చూపించు అని ఆయన అన్నారు. ఆ మాటలు నా మనసును తాకాయి. ఆ ఒక్క సంభాషణ నా దృక్పథాన్నే పూర్తిగా మార్చేసింది" అని ఆమె తెలిపారు.

కోహ్లీతో ఇప్పటికీ టచ్‌లో సింధు..

కోహ్లీ చెప్పిన ఆ సలహా ఇప్పటికీ తనతోనే ఉందని సింధు చెప్పారు. తాము ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నామని, తాను ఏ టోర్నీ గెలిచినా ఆ సంతోషాన్ని కోహ్లీతో పంచుకుంటానని తెలిపారు. ఎంతో సాధించిన ఒక గొప్ప వ్యక్తి నుంచి ఇలాంటి ఇన్‌పుట్స్ తీసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుందని, మైదానంలో ఆయన చూపించే అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆమె కొనియాడారు.

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శుభారంభం..

మరోవైపు, న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ (BWF) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 64 మ్యాచ్‌లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబుల్‌పై అద్భుత విజయం సాధించారు. కేవలం రెండు గేముల్లోనే 21-7, 21-11 తేడాతో ఘన విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేశారు.

Tags: