Pakistan Team’s World Cup Failure: పాక్ టీమ్ వరల్డ్ కప్ వైఫల్యం: సెలక్షన్ కమిటీకి అలీమ్ దార్ రాజీనామా!
సెలక్షన్ కమిటీకి అలీమ్ దార్ రాజీనామా!
Pakistan Team’s World Cup Failure: టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ జట్టు ఘోర వైఫల్యం ఆ దేశ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సూపర్-8 దశలోనే పాక్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో అభిమానులు, మాజీ ఆటగాళ్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యుడు అలీమ్ దార్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రపంచకప్ పరాజయం తర్వాత పాక్ క్రికెట్ బోర్డులో (PCB) జరిగిన మొదటి కీలక వికెట్ ఇదేనని చెప్పవచ్చు. మాజీ అంతర్జాతీయ అంపైర్ అయిన అలీమ్ దార్, 2024 అక్టోబర్‌లో ఈ కమిటీలో చేరారు. అయితే జట్టు పేలవ ప్రదర్శన బాధ్యత వహిస్తూ ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదు. గ్రూప్ దశలో నెదర్లాండ్స్, అమెరికాపై గెలిచినప్పటికీ, చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సూపర్-8లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఓడిపోవడం, ఆపై శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవడంలో విఫలం కావడంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ వైఫల్యంతో కెప్టెన్ సల్మాన్ ఆఘాను తొలగించాలని, స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌ను టీ20 జట్టు నుంచి పక్కన పెట్టాలని డిమాండ్లు పెల్లుబుకుతున్నాయి.
మరోవైపు, ఆటగాళ్ల ప్రదర్శనపై ఆగ్రహంతో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వారికి భారీ జరిమానా విధించాలని యోచిస్తోంది. జట్టులోని ప్రతి ఆటగాడికి సుమారు 5 మిలియన్ల పాకిస్థానీ రూపాయల (దాదాపు 15 లక్షల భారతీయ రూపాయలు) జరిమానా పడే అవకాశం ఉందని సమాచారం. కేవలం బోర్డు మాత్రమే కాకుండా, పాక్ ప్రభుత్వ పెద్దలు కూడా జట్టు ఆటతీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, కీలక టోర్నీల్లో దేశాన్ని నిరాశపరుస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు పాక్ క్రికెట్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.